
జనవరి 27న భీమిలిలో జరిగిన సభలో శంఖం పూరించి, ఢంకా భజాయించి రాబోతున్న శాసన సభ ఎన్నికలకు తాము సిద్ధమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నేటికి ఉన్న పరిస్థితులలో అధికార పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది.
మొన్న జరిగిన ఉరవకొండ సభలో గాని, భీమిలి, దెందులూరుల్లో గాని ఆయన వ్యవహార శైలి గమనిస్తే గెలుపు మీద ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నట్లుగా అనిపిస్తోంది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలతో ఒక విడదీయారని సంబంధం పెట్టుకోవడంలో ముఖ్యమంత్రి సఫలీకృతులయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు చదువు చెప్పడం, బడులను పునరుద్ధరించడం లాంటి గొప్ప నిర్ణయాలతో ఆయన పేద ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలను సాకారం చేసి వారికి బాగా దగ్గరయ్యారు. ఇది ఆయనకు ద్విగుణీకృతమైన లాభాలను చేకూరుస్తుంది. ఇవే కాక వృద్ధాప్య పింఛన్లు, వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా ద్వారా కొన్ని లక్షల మంది బడుగు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసి వారికి ఆర్థిక సాయం అందించారు.
కోవిడ్ నిర్బంధం వల్ల అకస్మాత్తుగా జీవనోపాధి కోల్పోయిన పెక్కు మంది పేద ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వల్ల కొంతైనా ఒడ్డుకు చేరగలిగారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ కుదేలైనా, జగన్ ప్రభుత్వం నెలకొల్పిన గ్రామ వాలంటీర్ల పద్ధతి వల్ల ఎంతో మందికి ఆర్థిక ప్రాణ వాయువు అందింది.
పక్క రాష్ట్రమైన తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలు నగదు బదిలీ పథకాల వల్ల తమ పరిస్థితులు మెరుగ్గా ఉన్న విషయాన్ని గమనించారు. ఈ పథకాలన్నీ ఒక ఎత్తు అయితే, ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని మరిన్ని జబ్బులకు విస్తరించడం, అంతరించిపోతున్నాయి అనుకుంటున్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య పెంచి కొత్త వాటిని పలు జిల్లాల్లో స్థాపించడం కూడా జగన్ పార్టీకి ఓట్లు రాబట్టబోతున్నాయి.
మరో వైపు రాష్ట్రంలో ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవటం జగన్‌కు మరింత బలంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జగన్‌కు బడుగు ప్రజలలో ఉన్న పాపులారిటీకి ఏమాత్రం గండి కొట్టలేక పోయింది. జగన్ అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమమే నెరపుతున్నారని విమర్శించిన టీడీపీ సంక్షేమానికి ప్రత్యమ్నాయం ఏదీ చూపించే ధైర్యం చేయలేకపోయింది. అంతే కాక, ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరు మీద టీడీపీ ప్రకటించిన ముందుస్తు మేనిఫెస్టోలో లెక్కకు మిక్కిలి అయిన తాయిలాలు ప్రకటించారు.
అవిభజిత ఆంధ్ర ప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ తదనంతర ఆంధ్రప్రదేశ్‌లు కలుపుకొని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వ్యవసాయాధారిత రాష్ట్ర ప్రాధాన్యతలను, పేద ప్రజలను విస్మరించి ఎప్పుడూ ప్రచార ఆర్భాటాలతో కూడిన పెట్టుబడి ప్రాజెక్టులు లేదా రాజధాని పేరిట సామాన్య ప్రజలకు అందనలవి కాని మిరిమిట్లు గొలిపే రియల్ ఎస్టేట్ వ్యాపారాల పైనే దృష్టి సారించారు. అలాంటి చరిత్రను చవిచూసిన ప్రజలు ఆయన్ని నమ్మే స్థితిలో లేరు. గతంలో టీడీపీ, అస్మదీయ మీడియా జగన్ అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైలు పాలైన వైనాన్ని తీవ్ర ప్రచారం చేసి కొద్దో గొప్పో లాభ పడ్డాయ్.
అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అలాంటి కేసుల్లో చంద్రబాబు కూడా జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటకి రావటంతో వాళ్ళు ఈ ఆరోపణలు చేసే హక్కుని కోల్పోయారు. ఇక రాష్ట్రం లోని మరో ప్రతిపక్ష పార్టీ అయిన జనసేన ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పడగ నీడ లోంచి బయట పడలేకపోతోంది. రాష్ట్రంలో పెక్కు మంది అభిమానులు ఉన్న సినీ హీరో అయినప్పటికీ పవన్ కల్యాణ్ ఏనాడూ తన అనుచర గణాన్ని ఒక బలమైన రాజకీయ శక్తిగా మలిచే పని చేయలేదు. చాలా సందర్భాల్లో సొంత పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తూ తన కేడరే విస్తు పోయేలా ప్రవర్తించారు.
2019లో సుమారు ఆరు శాతం ఓట్లు పొందిన పవన్ కల్యాణ్, హోరాహోరీగా ప్రచార ర్యాలీలు చేపట్టినప్పటికీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి దూరంగా ఉండటం, తన అనుచరుల నుండి ఏ ఒక్క నాయకుడిని కూడా ఆసరాగా తీసుకోకపోవడం వల్ల ఆయన ఓట్ల శాతం పెద్దగా పెరగదని అంచనా. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ రెండూ రాష్ట్రంలో కేవలం డమ్మీలుగా ఉన్నాయి.
బిహార్ తర్వాత అణగారిన కులాల డిమాండ్ అయిన కుల గణనను చేపట్టిన ఏకైక రాష్ట్రం జగన్ ప్రభుత్వం ఉన్న ఏపీ మాత్రమే. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఏవీ దీనిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. వెరసి, తాజా ఆలోచనలు, కొత్త తరగతుల నుండి ఉద్భవించాల్సిన రాజకీయ చైతన్యానికి అవకాశం ఉన్నప్పటికీ, విధానపరంగా కానీ, భిన్న వర్గాల నుండీ కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ను ఎదురించ గలిగే ప్రతిపక్షం లేదు.
మరో ఐదేళ్ల పాలనకు జగన్ మార్గం గురించి నొక్కిచెప్పాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన గత 56 నెలల్లో చేసిన పని ఆధారంగానే ఎన్నికలకు వెళ్తున్నారు, కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా కాదు. ఆయన ప్రకటనల ప్రచారంలో, సెంటర్–స్టేజ్ పూర్తిగా ఆయన సొంత సంక్షేమ చర్యలదే కాని వారసత్వ సంకేతాలపై కాదని స్పష్టంగా తెలుస్తుంది. కేవలం కొన్ని సంవత్సరాల క్రితం వరకు తన తండ్రి పేరు ఆధారం గానే కీర్తిని పొందిన వ్యక్తికి ఇది గుర్తించదగిన విజయం.
డా‘‘ జి. నవీన్
వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు; శాండియాగో, యూఎస్‌ఏ