
నిత్య యవ్వనం కోసం మందులు మాకులు మింగే వారి దగ్గరి నుంచి.. రకరకాల ప్రయోగాలతో ఒళ్లు హూనం చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఈ మధ్య మనం కాలంగా వింటున్నాం. కానీ.. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాన్ని మాత్రం ఇప్పటివరకూ జయించలేకపోతున్నాడు. అయితే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. శాస్త్రవేత్తలు మానవ శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటున్న కొద్దీ జబ్బులను ఎంతో కొంత నయం చేయగలిగాడు. తాజాగా ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం.. వారం రోజుల పాటు మంచుముక్కల్లో మునిగి తేలితే.. వృద్ధాప్యంతోపాటు వచ్చే సమస్యలను ఆలస్యం చేయవచ్చని తేలింది.
చల్లటి నీళ్లలో స్నానం చేస్తేనే వణికిపోతూంటాం మనం. జలుబు చేస్తుందేమో అని భయపడుతూంటాం. అలాంటిది వారం రోజులపాటు మంచుముక్కల్లో మునిగితేలితే ఇంకేమైనా ఉందా? అని అనుకుంటున్నారా? అక్కడే కిటుకు ఉందంటున్నారు ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నిజానికి మనం ఒకసారి చన్నీళ్లలో మునిగితే శరీరం అలర్ట్ అయిపోతుంది. ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చేసేందుకు ఇన్‌ఫ్లమేషన్‌ను సృష్టిస్తుంది. జలుబు లేదా ఒంటినొప్పులు వస్తాయన్నమాట. అయితే వీటిని విస్మరించి.. ఒక వారం రోజులపాటు మంచుముక్కల్లో మునుగుతూంటే మాత్రం శరీరం ఆ పరిస్థితికి అలవాటు పడిపోతుందని.. ఆటోఫేజీని మొదలుపెడుతుందని తాజా పరిశోధన ద్వారా తెలిసింది.
ఆటోఫేజీనా అంటే ఏంటో తెలుసా?
సింపుల్‌గా చెప్పాలంటే శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియ ఆటోఫేజీనా(Autophagy). కాస్త డెప్త్‌గా వెళ్తే.. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ మన శరీరంలోని కణాలు విడిపోతూనే ఉంటాయి. అయితే తినే ఆహారమనండి.. ఉండే వాతావరణం అనండి.. లేదా జన్యుపరమైన కారణాలైనా కానివ్వండి.. శరీర కణాల్లో కొన్ని పనికి రాకుండా పోతాయి. పాడైపోయిన ప్రొటీన్లు, కణ భాగాలు.. బయటి నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్‌ల భాగాలు వయసుతోపాటు పేరుకుపోతూంటాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతూంటాయి కూడా. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు శరీరం ఉపయోగించే ప్రక్రియే ఆటోఫేజీ.
.. శరీరం చెడిపోయిన, ముక్కలైపోయిన భాగాలను గుర్తించి వాటిని చిన్న బుడగల్లాంటి వాటిల్లో ప్యాక్ చేసి.. పనికొచ్చే వాటిని వాడుకుంటుంది. వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. దీనివల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. జబ్బు పడితే తొందరగా కోలుకోవచ్చు కూడా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్రక్రియను చేపడుతుంది శరీరం. చల్లటినీళ్లలో మునగడం వాటిల్లో ఒకటని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతూంటే.. వ్యాయామం, తగినన్ని పోషకాలు అందించడం... పదిహేడు గంటలకుపై నిరాహారంగా ఉండటం వల్ల కూడా ఈ ఆటోఫేజీ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవలికాలంలో వినిపిస్తున్న మాట.
పరిశోధనలు ఇలా..
ఒట్టావా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం... ఆరోగ్యంగా ఉన్న పది మంది మగాళ్లను ఎంచుకున్నారు. వీరి వయసు అటు ఇటుగా 23 ఏళ్లు. ఏడు రోజులపాటు వీరిని పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ చల్లటి నీళ్లలో రోజుకు గంట సేపు ఉంచారు. వీరి రక్తాన్ని సేకరించి ప్రొటీన్లను పరిశీలించారు. చల్లటి నీళ్లల్లో మునగడం కణాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు అన్నమాట. ఇన్‌ఫ్లమేషన్ అంటే మంట/వాపు ఏమైనా ఉందా? ఆటోఫేజీ మొదలైందా? ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఏర్పడ్డ షాక్ మాట ఏమిటి? అన్నవి పరిశీలించారు.
అకస్మాత్తుగా చల్లటి నీళ్లలోకి మునిగినప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ప్రొటీన్ల ఆకారంలో మార్పులు వస్తాయి. శరీర క్రియలన్నింటికీ కీలకమైన ప్రొటీన్లలో తేడా రాగానే శరీరం అలర్ట్ అవుతుంది. ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రత్యేకమైన ప్రొటీన్లు కొన్నింటిని విడుదల చేస్తుంది. ఇవి చలికి ఉండచుట్టుకుపోయిన ప్రొటీన్లు మళ్లీ సాధారణ స్థితికి చేరేలా చేస్తాయి. బాగా పాడైన ప్రొటీన్లను ఆటోఫేజీకి గురి చేస్తాయి!
చల్లటి నీళ్లల్లో ఒక్కసారి మునిగితే శరీరంలో అద్భుతాలు జరిగాయని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లను పట్టుకుని క్లీన్ చేసే పీ62 అనే ప్రొటీన్ ఉత్పత్తి బాగా పెరిగిందని, ఆ తరువాత ఆటోఫేజీ ప్రక్రియలో రెండూ ముక్కలు ముక్కలపోయి శరీరంలో పేరుకుపోయిన కణాల చెత్త తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు!
ముఖ్య గమనిక: ఇలాంటివి స్వంతంగా మీరు ప్రయత్నించొద్దు. ఈ విషయమై మీ డాక్టర్‌తో మాట్లాడటం మాత్రం మరచిపోవద్దు!