
రేసులో ప్రధాని ముందంజ
తగ్గుతున్న కన్జర్వేటివ్ గ్రాఫ్
ట్రంప్ వ్యతిరేకతే ప్రధానాంశం
కార్నీవైపే మెజారిటీ ప్రజల మొగ్గు
కొన్నేళ్లుగా నానారకాలైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కెనడాలో ఎన్నికల నగారా మోగింది. లిబరల్ పార్టీ సారథి, నూతన ప్రధాని మార్క్ కార్నీ అనూహ్యంగా ‘ముందస్తు’ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ దాకా ఆగకుండా ఏప్రిల్ 28వ తేదీనే ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారంతో దూసుకెళ్తున్నారు. విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా విజయంపై ధీమాగా ఉన్నారు.
ప్రస్తుతం తమ పార్టీకి అంతా అనుకూలంగా ఉందని కార్నీ భావిస్తున్నారు. ఇందుకు గట్టి కారణాలూ లేకపోలేదు. నిజానికి జస్టిన్ ట్రూడో పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా దేశాన్ని ఆయన తిరోగమన బాట పట్టించారని వారంతా ఆగ్రహించారు. దాంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కన్జర్వేటివ్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. కానీ మూడు నెలలుగా పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. ట్రూడోను ప్రధాని పదవి నుంచి తప్పించడంతో లిబరల్ పార్టీపై ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చినట్టు కన్పిస్తోంది.
దానికితోడు కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్‌కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షునితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు కార్నీ ప్రధాన ప్రత్యర్థి అయిన కన్జర్వేటివ్ నేత పొలియెవ్రాకు ట్రంప్ సమర్థకునిగా పేరుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగోసారి తమ గెలుపు లాంఛనమేనని లిబరల్ పార్టీ అంచనా వేసుకుంటోంది. కెనడాలో గత పదేళ్లలో జస్టిస్ ట్రూడో లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
మార్క్ కార్నీ
60 ఏళ్ల కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు కూడా చీఫ్‌గా పని చేసిన ఘనత ఆయనది. అయితే రాజకీయాలకు మాత్రం పూర్తిగా కొత్త. కనీసం పార్లమెంటుకు పోటీ చేసి గెలిచిన చరిత్ర కూడా లేకున్నా కొద్ది రోజల క్రితమే అనూహ్యంగా ఏకంగా ప్రధాని అయిపోయారు. అలా ప్రధాని హోదాలో ఎన్నికల అరంగేట్రం చేస్తున్న నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రూడో గద్దె దిగాక లిబరల్ పార్టీ సారథ్య ఎన్నికల్లో ఏకంగా 85 శాతం మంది కార్నీకే ఓటేయడం విశేషం. ఉత్తర కెనడా నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే.
ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్‌పై ఆయన కఠిన వైఖరి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను కార్నీ తూర్పారబట్టారు. కెనడా సార్వబౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతానని ప్రకటించారు.
కెనడాపై ట్రంప్ సుంకాలకు దీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెర తీసి ప్రజల మన్నన చూరగొన్నారు. నానా సమస్యలు ఎదుర్కొంటున్న దేశాన్ని ఈ ఆర్థిక నిపుణుడు గాడిలో పెడతారని వారు నమ్ముతున్నారు. నలుగురు అభ్యర్థుల్లో కార్నీయే మెరుగని ప్రజలు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతుండటం విశేషం. ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రచార సభకు విశేషాదరణ లభించింది. ‘‘ట్రంప్ రూపంలో కెనడా తన చరిత్రలోనే అతి పెద్ద ముప్పు ఎదుర్కొంటోంది. దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు నాకు భారీ మెజారిటీ ఇవ్వండి’’ అంటూ కార్నీ ఇచ్చిన పిలుపునకు జనం విపరీతంగా స్పందించారు.
పియే పొలియెవ్రా
45 ఏళ్ల పొలియెవ్రా కన్జర్వేటివ్ పార్టీ సారథి. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన యువ నేత. 25 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కునిగా నిలిచారు. ట్రూడో విధానాలకు తీవ్ర వ్యతిరేకి. దేశ సమస్యలన్నింటికీ అవే కారణమని నిత్యం విమర్శిస్తుంటారు.
ధరల పెరుగుదల నుంచి హౌసింగ్ సంక్షోభం దాకా నానా ఇక్కట్లతో సతమతమవుతున్న కెనడావాసులను దూకుడైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ వచ్చారు. ఏడాదిన్నర క్రితం దాకా అన్ని సర్వేల్లోనూ హాట్ ఫేవరెట్‌గా నిలిచారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొలియెవ్రా ప్రధాని కావడం లాంఛనమేనని అంతా భావించిన పరిస్థితి! కానీ కార్నీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. దీనికి తోడు ట్రంప్ సమర్థకుడన్న పేరు కూడా పొలియెవ్రాకు చేటు చేస్తోంది. దాంతో ఆయన కూడా ట్రంప్‌పై విమర్శలకు దిగుతుండటమే గాక ‘కెనడా ఫస్ట్’ నినాదం ఎత్తుకున్నారు. అయితే ఆదివారం నాటి ఆయన ఎన్నికల ప్రసంగానికి అంతంత స్పందనే లభించింది.
జగ్మిత్ సింగ్
భారత సంతతికి చెందిన 46 ఏళ్ల జగ్మిత్ వామపక్ష న్యూ డెమొక్రటిక్ పార్టీ సారథి. కెనడాలో ఓ ప్రధాన పార్టీకి సారథ్యం వహిస్తున్న తొలి మైనారిటీ నేతగా రికార్డులకెక్కారు. ఎన్‌డీపీ 2021 నుంచి ట్రూడో ప్రభుత్వానికి మూడేళ్ల మద్దతిచ్చి దాని మనుగడకు కీలకంగా నిలిచింది. 2024లో మద్దతు ఉపసంహరించుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీపీ పెద్ద ప్రభావం చూపబోదని సర్వేలు పేర్కొన్నాయి. దానికి 9% మంది ఓటర్లు మద్దతిస్తున్నట్టు తేల్చాయి. పార్టీకి అధికారిక గుర్తింపును నిలుపుకోవడమే ఎన్‌డీపీకి సవాలుగా మారవచ్చంటున్నారు. బ్లాక్ క్యుబెక్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఫ్రానోయిస్ బ్లాంచెట్ బరిలో ఉన్నారు. క్యూఎన్‌పీ పోటీ ఫ్రెంచి ప్రాబల్య ప్రాంతాలకే పరిమితమైంది. జగ్మిత్, బ్లాంచెట్ పోటీ నామమాత్రమేనని భావిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్