
కఠ్మాండు:నేపాల్‌లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.