
వాషింగ్టన్: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ రానున్న అధ్యక్షుడు బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ‘జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7వ తేదీన అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి చేరుకుంటారు.
8న ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం రాత్రి బైడెన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌లో వివరించింది. 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర భేటీల్లో ఆయన పాల్గొంటారు. ఇతర జీ20 భాగస్వామ్య దేశాల నేతలతో ఆయన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులను నిలువరించడం వంటి అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి ప్రయత్నాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 10న వియత్నాంకు బయలుదేరి వెళతారని పేర్కొంది.