
అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి
మూడు దశాబ్దాలుగా ఉగ్ర శిక్షణ
ఆ చెత్తపనులన్నీ అమెరికా కోసమే
అంతర్జాతీయ మీడియాతో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు! దాంతో ఈ విషయమై భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది.
స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది. దీనిపై మీరేమంటారు?’ అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ, ‘‘అవును. అది నిజమే’’ అంటూ అంగీకరించారు. అయితే, ‘‘అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్‌లో సోవియట్‌పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. ‘‘మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్‌పై పోరులో, 2001 సెప్టెంబర్ 11 అల్‌కాయిదా ఉగ్ర దాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్రే వేరుగా ఉండేది’’ అంటూ వాపో యారు. సోవియట్‌తో ప్రచ్ఛన్నయుద్ధంలో, న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్ర దాడి తర్వాత అఫ్గానిస్తాన్‌పై ఆక్రమణలో అమెరి కాకు పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే.
లష్కరే లేనేలేదట!
పహల్గాం ఉగ్ర దాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచాలత ప్రదర్శించారు. కశ్మీర్‌తో పాటు పాక్‌లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గాం దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ విన్లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
దురాక్రమణను ఎదుర్కొంటాం
పహల్గాం దాడితో పాక్ సంబంధముందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనేట్ శుక్రవారం తీర్మానం చేసింది. ‘‘మాపై దురాక్రమణకు దిగితే దీటుగా ఎదుర్కొంటాం. ఆ సామర్థ్యం మాకుంది’’ అని పేర్కొంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది.