
ఉక్రెయిన్‌కు అమెరికా ప్రతిపాదన
వాషింగ్టన్: ‘మినరల్స్ ఫర్ వెపన్స్’ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌పై మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్‌లైన్‌ను తమకు అప్పగించాలనే కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించాలని.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అమెరికా వైఖరిని ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ వోలోదిమిర్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయని, వాటిని అంగీకరించే అవకాశం లేదని ఆయన చెప్పారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్‌లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది.
పశ్చిమ రష్యాలోని సుడ్జా నుంచి స్లొవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్‌హోరోడ్ వరకు ఈ పైప్‌లైన్ ఉంది. ఇది యూరప్‌కు రష్యన్ గ్యాసు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రణలోకి తీసు కోవాలని యూఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తోంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్‌ప్రోమ్‌తో ఉక్రెయిన్ ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది.
బెర్లిన్ తరహాలో విభజిద్దాం...
ఉక్రెయిన్‌ను బెర్లిన్‌లాగా విభజించవచ్చని అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటీష్ జోన్, యూఎస్ జోన్ తరహాలో.. ఉక్రెయిన్‌లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతంలో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం ఉండవచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని వెల్లడించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమన్నారు.