
విధివిధానాలు అధికారికంగా ఖరారు
ప్రధాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ చూస్తే నాకు అసూయగా ఉంది
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్
జైపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఆయనను చూస్తే అసూయగా ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదన్నారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న అప్రూవల్ రేటింగ్స్ తనకు అసూయ కలిగిస్తున్నాయని, ఈ విషయం సోమవారం నేరుగా మోదీకే చెప్పానని వెల్లడించారు.
‘మోదీ స్పెషల్ పర్సన్’ అని ప్రశంసించారు. మంగళవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఓ సదస్సులో వాన్స్ ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రకటించారు. రోడ్‌మ్యాప్‌పై విధివిధానాలను ఇరు దేశాలు అధికారికంగా ఖరారు చేశాయని వెల్లడించారు. భారతదేశ ఉత్పత్తులపై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం కావడం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల విజన్ వాస్తవరూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని వాన్స్ అభివర్ణించారు. భారత్–అమెరికా సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘కొరుకుడుపడని కఠినమైన సంధానకర్త’ అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులభం కాదన్నారు. అందుకే ఆమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు.
మిత్రుడిగా వచ్చా..
తాను ఇండియాకు నీతిబోధలు చేయడానికి రాలేదని, ఒక భాగస్వామిగా, మిత్రుడిగానే వచ్చానని జె.డి.వాన్స్ అన్నారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకు నేర్పే ఉద్దేశం తనకు లేదన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్‌కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్‌ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు . ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్‌కు విజ్ఞప్తిచేశారు.
అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’పై ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
ఇవాన్ ఇండియాలోనే ఉంటానన్నాడు
ప్రధాని మోదీ తమకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారని జె.డి.వాన్స్ ఆనందం వ్యక్తంచేశారు. మోదీ ప్రేమానురాగాలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలకు మోదీ ఎంతో ఆత్మీయులయ్యారని తెలిపారు. మోదీ ఇచ్చిన విందు తన కుమారుడు ఇవాన్‌కు ఎంతోగానో నచ్చిందని, ఇండియాలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు ఇవాన్ తనతో చెప్పాడని అన్నారు. తన పిల్లలకు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మోదీతోనూ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తన కంటే తన భార్య ఉషా చిలుకూరికే గొప్ప ఆదరణ లభిస్తోందని వాన్స్ చమత్కరించారు.
అంబర్ కోట సందర్శన
వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం రాజస్తాన్‌లోని చరిత్రాత్మక అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారీతోపాటు అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. చక్కగా అలంకరించిన ఏనుగులు, తీర్చిదిద్దిన రంగవల్లులు, జానపద నృత్యాలతో అమెరికా ఉపాధ్యక్షుడికి ఆత్నియ స్వాగతం లభించింది. చందా, మాలా అనే రెండు ఏనుగులు తొండాలు ఎత్తి వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. రాజస్తానీ సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి.