
హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ బాంబే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె సోదరుడి భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24న హన్సిక పిటిషన్ వేయగా.. ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. గతంలో హన్సికతో పాటు ఆమె తల్లిపై సోదరుడి భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ గృహ హింస కేసు పెట్టారు. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది.