
సల్మాన్ ఖాన్ ఇటీవలే సికందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఊహించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు సల్లు భాయ్ ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొన్నారు. అదే సమయంలో రష్మికతో సల్మాన్ ఏజ్ గ్యాప్‌పై పలువురు ప్రశ్నించారు. మీ కూతురి వయస్సున్న అమ్మాయితో ఎలా నటిస్తారంటూ నెట్టింట విమర్శలొచ్చాయి. దీనిపై సల్మాన్ సైతం స్పందించారు. ఆమెకు లేని ఇబ్బంది.. మీకు ఎందుకని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. భవిష్యత్తులో రష్మికకు పాప పుడితే ఆమెతో కూడా నటిస్తానని సల్మాన్ ఖాన్ అన్నారు.
తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా స్పందించారు. సినిమాల్లో నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ అనేది సాధారణ విషయమన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీషా పటేల్ మాట్లాడారు. అలాగే తనకు కూడా గదర్ చిత్రంలో సన్నీ డియోల్‌కు, నాకు దాదాపు 20 ఏళ్ల అంతరం ఉందని ఆమె గుర్తు చేశారు.
అమీషా మాట్లాడుతూ..' గదర్-2 సినిమాలో నాకు సన్నీ డియోల్‌కు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. అందుకే మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. అలాగే సల్మాన్, రష్మిక జోడిని అభిమానులు ఇష్టపడుతున్నారు. నేను కూడా నాకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో కలిసి పనిచేశానని' తెలిపింది.