
చిన్నితెర మీద యాంకర్‌గా అనసూయ(Anasuya Bharadwaj ) ప్రయాణం ఓ స్పెషల్. అటు చిన్నితెర మీదా ఇటు వెండితెర మీద కూడా గుర్తుంచుకోదగిన పాత్రలు పోషించే అవకాశం ఆమెకు మాత్రమే దక్కిందని చెప్పవచ్చు. కేవలం యాంకర్, యాక్ట్రెస్‌గా మాత్రమే కాకుండా సోషల్ మీడియా సెలబ్రిటీగా కూడా అనసూయ ముందంజలో ఉంది. యాక్టింగ్, యాంకరింగ్ టాలెంట్‌తో పాటు తనదైన శైలిలో గ్లామర్ కూడా పండించడంతో ఆమె తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతుంటారనేది వాస్తవం.
ప్రస్తుతం మిడిల్ ఏజ్‌లో ఉన్న ఈ బ్యూటీ మధ్యలో కాస్త ఓవర్ వెయిట్ అనిపించినా.. ఇప్పుడు మళ్లీ మంచి శరీరాకృతి సాధించి అభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు వారితో ఆమె తరచుగా తన ఫిట్‌నెస్ జర్నీ విశేషాలు కూడా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె అమ్మాయిలకు అందించిన ఓ సందేశం ఆసక్తికరంగా ఉంది.
మహిళలు, ఉద్యోగినులు అయినా గృహిణులు అయినా, తమ కోసం తాము టైమ్ కేటాయించుకోలేక ఒత్తిడికి గురవుతారు; వారి షెడ్యూల్ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ అయిపోయి ఉంటుంది. పిల్లలని స్కూల్‌కి రెడీ చేయడంతో మొదలుపెడితే.. భర్తలు అత్తమామలకు టిఫిన్లు ప్యాక్ చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఆపై నేరుగా వంట లేదా ఇతర పనుల్లోకి తలమునకలవడం... తో రోజు గడచిపోతుంటుంది. ఇటువంటి దినచర్య మధ్య, తరచుగా చాలా మంది మహిళలకు ఫిట్‌నెస్ అనేది ఓ టైమ్ వేస్ట్ పనిలా అనిపిస్తుంది.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ యాంకర్ అనసూయ భరద్వాజ్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది. ఆమె మహిళలకు కొన్ని ఆచరణీయ సలహాలను కూడా అందించింది, తనకు కూడా ఒకప్పుడు జిమ్‌కి వెళ్లడానికి ఆసక్తి ఉండేది కాదని ఇప్పుడు జిమ్ వర్కువట్స్ ప్రారంభించిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని చెప్పిందామె. ఇన్ స్ట్రాగామ్‌లో తన జిమ్ వర్కౌట్‌ల వీడియోను పోస్ట్ చేస్తూ, అనసూయ ఇలా వివరించింది
‘‘వంశపారంపర్యంగా నేను ఫిట్‌గా పుట్టాను. అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడతాను ఇక జిమ్‌కి ఎందుకు వెళ్లాలి?’ అని నేను అనుకున్నాను. ఓ ఇంటర్వ్యూలో అదే విషయం చెప్పాను కూడా. కానీ క్రమం తప్పకుండా రెండేళ్ల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామం చేశాక.. దాని ప్రాముఖ్యతను నేను ఇప్పుడు గ్రహించాను.. అంతేకాదు 30 ఏళ్ళ వయసు నుంచి 40కి చేరువవుతున్నప్పుడు నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం మొదలయ్యాక.. అప్పుడు అనిపించింది ఈ వ్యాయామాలను ముందుగానే ప్రారంభించి ఉండాల్సింది అని.
కాబట్టి ‘అమ్మాయిలూ మీరు ఎంత త్వరగా జిమ్‌కి వెళ్లడం ప్రారంభిస్తే అంత మంచిది. ఇది మీ కోసం, మీ కుటుంబం కోసం కాదు. నాకు తెలుసు మీరు మూడు పూటలా వంట చేయాలి. మీ భర్త పిల్లల అత్తమామల బాగోగులు చూసుకోవాలి. కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీ కుటుంబాన్ని కూడా కొంత భారం పంచుకోమని చెప్పండి. ఓ గంట మీకోసం మీరు కేటాయించుకోండి. అప్పుడు మార్పు చూసి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. జిమ్‌కి వెళ్లడం ఒక అవసరం, విలాసం కాదు’’ అంటూ ఇన్‌స్టా ద్వారా అనసూయ అందించిన సందేశం ఎంతైనా అనుసరణీయం. ఇంటి పనిభారం మోసే మహిళలు, అమ్మాయిలను తమ కోసం కూడా సమయాన్ని వెచ్చించమని ప్రోత్సహిస్తోంచే ఈ సలహాను అమ్మాయిలు పాటిస్తారనే ఆశిద్దాం.