
బాబీ, అనిల్ రావిపూడి, బాలకృష్ణ, కృష్ణప్రసాద్, బాబూ మోహన్
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్‌ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.
‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.
బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ సినిమా క్రెడిట్‌లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు.