
ఆదిత్య 369 (Aditya 369 Movie).. 1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన మూవీ ఇది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది.
విజయశాంతిని అనుకున్నాం..
ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఆదిత్య 369 సినిమా మొదటగా విజయశాంతిని అనుకున్నాం. తను కూడా సరేనంది. కానీ అప్పటికే ఆమె సినిమాలతో బిజీగా ఉంది. మీరు వేరే హీరోయిన్‌ను తీసుకోండి, నాకు విజయశాంతి కావాలని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. సరేలే అనుకుని రాధను సెలక్ట్ చేయాలనుకున్నాం. కానీ, ఆమె కాస్త బొద్దుగా మారటంతో మళ్లీ వేరే కథానాయికను వెతికే పనిలో పడ్డాం.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్
పెళ్లయ్యాక సినిమాలకు గుడ్‌బై
సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. తమిళంలో 'ఈరమాన రోజావే' సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని సూచించాడు. అలా ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేస్తే అందరికీ నచ్చింది. అలా మోహిని ఈ సినిమా చేసింది. తర్వాత రెండు మూడు సినిమాలు చేసిందనుకుంటాను. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు ముగింపు పలికింది అని తెలిపాడు. ఇకపోతే ఆదిత్య 369 వచ్చిన 34 సంవత్సరాల తర్వాత దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. కథ రెడీ అయిందని, త్వరలోనే పార్ట్ 2 ఉంటుందని బాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.