
చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ లీడ్ రోల్‌లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలోని భక్తి పాట ‘రామ... రామ’ లిరికల్ వీడియోను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు గురువారం వెల్లడించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఎమ్‌ఎమ్ కీరవాణి స్వరకల్పనలో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా ఈ సినిమాలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని, కృష్ణా జిల్లాలోని నందిగామ దగ్గర ఉన్న భారీ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఈ ‘రామ... రామ’ పాటను రిలీజ్ చేయనున్నారని, సినిమాను జూలై 24న విడుదల చేస్తారని సమాచారం. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.