
వాహనానికి కూడా జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో నుంచి పుట్టిందే టుక్ టుక్ మూవీ (Tuk Tuk Movie). హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి, తెలుగమ్మాయి శాన్వీ మేఘన (Saanve Megghana) ప్రధాన పాత్రల్లో నటించారు. పూరీ జగన్నాథ్ దగ్గర రచయితగా పని చేసిన సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించారు.
గత నెలలో థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలో
మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్ష రోషన్ హీరోగా నటించిన కోర్ట్ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా ఉంటుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం రాబట్టుకోలేకపోయింది. అయితే నటీనటుల పర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
కథేంటంటే?
ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు (హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బు కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. వినాయక నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఓ పాత స్కూటర్‌ను తెచ్చుకుని ముగ్గురూ కూర్చునే టుక్ టుక్ బండిలా తయారు చేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లవారు నుంచి ఆ బండి దానంతటదే ఆన్ అవుతుంది. తిరుగుతుంది. దీంతో ఆ స్కూటర్‌లో దేవుడు ఉన్నాడని భావిస్తారు. మరి నిజంగానే అందులోకి దేవుడు ప్రవేశించాడా? లేక ఆత్మనా? అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్‌ను ఏం చేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..