
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన నటులు ఫవాద్ ఖాన్‌తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.
అయితే మహీరా ఖాన్ తన పోస్ట్‌ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.
పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు.