జేఈఈ మెయిన్ ఫ‌లితాలు.. 110 మందికి షాక్! | JEE Main Result 2025: Why NTA withholds results of 100 candidates? | Sakshi
Sakshi News home page

JEE Main Result 2025: ఆ 110 మంది ఫ‌లితాల‌ను ఎందుకు నిలిపివేశారు?

Published Sat, Apr 19 2025 5:46 PM | Last Updated on Sat, Apr 19 2025 5:51 PM

JEE Main Result 2025: Why NTA withholds results of 100 candidates?

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్ర‌వారం అర్థ‌రాత్రి విడుద‌ల చేసింది. 2.50 ల‌క్ష‌ల మంది అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌కు అర్హ‌త సాధించిన‌ట్టు వెల్ల‌డించింది. 24 మంది 100 ప‌ర్సంటైల్ సాధించిన‌ట్టు తెలిపింది. అయితే 110 మంది ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌కుండా ఎన్టీఏ నిలిపివేసింది. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌ల‌తో వీరి ఫ‌లితాల‌ను ప్ర‌కటించ‌లేద‌ని ఎన్టీఏ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఫోర్జ‌రీ ప‌త్రాలు ఉప‌యోగించ‌డం పాటు ర‌క‌ర‌కాలుగా మోసాల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోపించింది.

వ్య‌క్తిగ‌త వివరాల్లో వ్య‌త్యాసం కార‌ణంగా మ‌రో 23 మంది ఫలితాల‌ను కూడా ప్ర‌క‌టించ‌లేదు. ఫొటోలు, బ‌యోమెట్రిక్ డేటాలో తేడాల‌ కార‌ణంగా ఈ 23 మంది రిజ‌ల్ట్ విడుద‌ల కాలేదు. వీరు గెజిటెడ్ అధికారి సంత‌కంతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ స‌మ‌ర్పించాల‌ని ఎన్టీఏ (NTA) సూచించింది. వీటిని ప‌రిశీలించిన ఫలితాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. తాము ఎటువంటి త‌ప్పుచేయ‌లేద‌ని అభ్య‌ర్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

జేఈఈ మెయిన్ (JEE Main) ప‌రీక్షలు దేశవ్యాప్తంగా రెండు సెష‌న్ల‌లో  జ‌న‌వ‌రి- ఏప్రిల్‌లో జ‌రిగాయి. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అక్ర‌మాలకు పాల్పడిన‌ట్టు ఎన్టీఏ గుర్తించింది. సెష‌న్ 2లో ఇదే  ర‌క‌మైన ఆరోప‌ణ‌ల‌తో 110 మందిని గుర్తించ‌డంతో మొత్తం 149 మందిని అనుమానిత జాబితాలో చేర్చింది. వీరిలో 133 మంది ఫలితాలు విడుద‌ల చేయ‌కుండా ఎన్టీఏ నిలిపివేసింది. తాము నిబంధ‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌ని నిరూపించుకున్న త‌ర్వాతే వీరి ప‌రీక్షా ఫలితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని ఎన్టీఏ స్ప‌ష్టం చేసింది. నిష్పాక్షికత, పారదర్శకత విష‌యంలో ఎటువంటి రాజీ ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

స‌రైన ప‌త్రాల‌తో త‌మ‌ను సంప్ర‌దించండి
ఫ‌లితాలు విడుద‌ల‌కాని అభ్య‌ర్థులు స‌రైన ప‌త్రాల‌తో త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ఎన్టీఏ సూచించింది. క‌రెక్ట్ ఐడెంటిటీ ప్రూఫ్‌, బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్, ఎథిక‌ల్ కండ‌క్ట్ క‌లిగివుంచాల‌ని వెల్ల‌డించింది. ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించ‌డానికి అనైతిక మార్గాలు అనుస‌రించ‌కుండా అడ్డుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరింది. 

చ‌ద‌వండి: 100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే

అక్ర‌మాల నివార‌ణ‌కు చ‌ర్య‌లు
దేశంలో అత్యంత పోటీ ఉండే జేఈఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్టీఏ ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప‌లు ర‌కాలుగా భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తోంది. బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్, ఏఐ- ఆధారిత వీడియో ఎన‌లిటిక్స్‌, ప‌రీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెడుతోంది. ప‌రీక్ష‌ల్లో డిజిటిల్ అక్ర‌మాల‌ను నిరోధించేందుకు ఎగ్జామ్స్ సెంట‌ర్ల వ‌ద్ద 5జీ జామ‌ర్ల‌ను అమ‌రుస్తోంది. అంతేకాదు కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన ప‌రీక్షా కేంద్రాల్లో థ‌ర్డ్ పార్టీ ఏజెన్సీల‌తో ముందుగానే త‌నిఖీలు నిర్వ‌హించింది. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌ను అరిక‌ట్టేందుకు 1100 మందికి పైగా పరీక్షా నిర్వాహకులు, భాగ‌స్వాముల‌కు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని సెంట్ర‌ల్ కంట్రోల్ రూం నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షా కేంద్రాల్లోని క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తూ అల‌ర్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement