
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.
ప్రధాని మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్‌లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.
Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5
— K.Annamalai (@annamalai_k) April 27, 2025
బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.
దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు.