
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.
అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.