
చెరకు సాగులో నూతన వంగడాలు
● 3102 రకం సాగుపై రైతుల ఆసక్తి ● ఎకరాకు 60 టన్నుల దిగుబడి ● జహీరాబాద్‌లో సుమారు3 వేల ఎకరాల్లో సాగు ● పెరుగుతున్న పంట విస్తీర్ణం
జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. దీర్ఘకాలిక వాణిజ్య పంట కావడంతో సంవత్సరం కాలంపాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. పాత రకాలనే సాగు చేయడం, మరో వైపు పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు రైతులు ఎంచుకుంటారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంత రైతులు 3102 రకం చెరకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
– జహీరాబాద్ టౌన్
జహీరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన రకాలనే పండిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 40 టన్నుల వరకు దిగుబడి రావాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 25 టన్నులు దాటడం లేదు. అందుకని రైతులు అధిక దిగుబడి ఇచ్చే రకాల సాగుపై మొగ్గు చూపుతుంటారు. జిల్లాలో అధికశాతం కో 86032, కో 808005, 87025, 83ఎ30 తదితర రకాలను పండిస్తున్నారు. వీటిలో చెక్కర శాతంతోపాటు దిగుబడి కూడా వస్తుందని కర్మాగారాల యాజమాన్యాలు వీటినే సూచిస్తున్నారు. పెద్దగా లాభాలు లేకున్నా నష్టం రాదన్న ఉద్దేశ్యంతో తప్పని పరిస్థితుల్లో రైతులు ఈ రకాల పంటను పండిస్తున్నారు.
పెరిగిన 3102 రకం పంట విస్తీర్ణం
జహీరాబాద్ ప్రాంతంలో రెండు, మూడేళ్ల నుంచి కొంత మంది రైతులు అధిక దిగుబడినిచ్చే 3102 కొత్త రకం చెరకు పంటను పండిస్తున్నారు. ఈ రకం పంట అధిక దిగుబడి వస్తుందని సాగుపై మొగ్గు చూపడంతో పంట విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాల్లో ఈ రకం చెరకు పంట సాగవుతోంది. అధిక విస్తీర్ణంలో సాగవుతున్న కో 86032, కో 808005 తదితర రకాల చెరకు పంట ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అదే 3102 రకం అయితే 60 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. చెరకు గడలు ఏపుగా పెరుగుతాయి. ఎరువులు, కలుపు మొక్కల నివారణ ఖర్చులు తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. కొత్త రకం పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతుండటంతో విత్తనంకు డిమాండ్ పెరిగి టన్నుకు రూ. 5 వేలు పలుకుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
లాభాలు వస్తున్నాయి
శాస్త్రవేత్తలు, చెక్కర కర్మాగారం కంపెనీ యాజమాన్యం సూచించిన కో 86032, కో 808005 రకాలకు కొన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. పెట్టుబడులు పెరగడం తప్ప ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. లాభాలు తగ్గడంతో రెండేళ్ల నుంచి 3102 రకం పంటను సాగు చేస్తున్నా. పంట దిగుబడి పెరిగి లాభాలు వస్తున్నాయి. విత్తనం కూడా మంచి డిమాండ్ ఉంది.