
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎంపీ రఘునందన్‌రావు
నంగునూరు(సిద్దిపేట): ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముడ్రాయి, రాజగోపాల్‌పేట, వెంకటాపూర్, మైసంపల్లి, పాలమాకులలో వడగళ్ల వానతో దెబ్బ తిన్న రైతుల పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాళ్ల వాన పడితే తాలు తప్ప గింజ మిగలదని తెలియని ఓ మంత్రి.. పొలంలో వరిని చూసి తాలు పండిస్తారా అని అవమానకర రీతిలో మాట్లాడడం బాధాకరమన్నారు. పంటలను పరిశీలించిన మంత్రి పరిహారం ఇమ్మంటే సొళ్లు కబురు చెప్పారని, ఇందిరమ్మ రాజ్యమంటే రైతులను గోస పెట్టడమేనా అని ప్రశ్నించారు. ఏఓ, ఏఈఓలు గ్రామాల్లో తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకొని నివేదిక పంపాలన్నారు. అలాగే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మండలశాఖ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తిరుపతిరెడ్డి, రజినీకర్‌రెడ్డి, యాదమల్లు, శ్రీనివాస్, కృష్ణమూర్తి ఉన్నారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సిద్దిపేటజోన్ : సిద్దిపేట పట్టణంలోని 16, 31, 32 వార్డుల్లో గావ్ ఛలో, బస్టీ ఛలో కార్యక్రమాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల పై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా సమయంలో ఉచితంగా టీకా, బియ్యం ఇచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.