
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.
ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.
ఘోర ఓటములు
శ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లోనూ 3-1తో ఓటమిపాలైంది.
తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్‌కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!
ఈ రివ్యూ మీటింగ్‌లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్‌రూమ్‌లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది.
45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
వారి మ్యాచ్ ఫీజులలో కోత?
ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్‌తో కలిసి రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.
కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది.
కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వలేదు.
మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.
చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్