
రైతులు ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవాలి
నరసన్నపేట: రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, దీన్ని ప్రతి రైతూ డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ సేవలు పొందాలని నరసన్నపేట వ్యవసాయ అధికారి కె.సునీత తెలిపారు. నేషనల్ టెస్ట్ సర్వేలెన్స్ సిస్టం అనే యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకుంటే, ఇందులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలు ఆయా శాస్త్రవేత్తలు నుంచి పొందవచ్చని తెలిపారు. మడపాం రైతు సేవా కేంద్రంలో కొందరు రైతులతో యాప్ డౌన్‌లోడ్ చేయించి దీనిపై గురువారం అవగాహన కలిగించారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో 40 మంది రైతులతో ఈ నెలాఖరుకల్లా యాప్ డౌన్‌లోడ్ చేయించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు టార్గెట్ ఇచ్చామన్నారు. ఈ యాప్‌లో తమ పంట పొలాల్లో ఉన్న తెగుళ్లు, పురుగులు, భూమిలో లోపాలు వంటివి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తే ఆయా విభాగాల శాస్త్రవేత్తలు వెంటనే స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. రైతులకు ఈ యాప్ ఎంతగాననో ఉపకరిస్తుందని ఆసక్తి గల రైతులు అందరూ తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.