
ఆధిపత్యం కోసమేనా..?
ప్రస్తుతం ఉన్న నగర కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో కొత్తగా లీజుదారులతో నిర్మాణం చేపడతారని, కిమ్స్ రోడ్డు, రైతు బజారు కూడలి, కిన్నెర థియేటర్, జిల్లా పరిషత్ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చి, అక్కడ నిర్మా ణాలు చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టౌన్ వెండింగ్ కమిటీ వేయడం, అందులో ఎమ్మెల్యే సతీమణితో పాటు పలువురు కీలక వ్యక్తులను నియమించడం చూస్తుంటే కార్పొరేషన్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంపై ఆధిపత్యం కోసం స్థానికంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎప్పుడో 2014–19లో జారీ చేసిన గెజిట్‌లు, రూపొందించిన చట్టాలను బయటకు తీసి టౌన్ వెండింగ్ కమిటీ పేరుతో ప్రత్యేక కమిటీని నియమించారు. 13 మంది సభ్యులు గల కమిటీలో ఐదుగురు టీడీపీ నాయకులకు చోటు కల్పించారు. వారిలో ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు బీజేపీ, జనసేన నాయకులకు మొండిచేయి చూపడం కూడా సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఈ కమిటీ వేసింది కమిషనరే అయినప్పటికీ ప్రతిపాదనలు మాత్రం ముమ్మాటికీ కీలక నేతల ద్వారానే జరిగినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సతీమణి స్వాతికి చోటు కల్పించి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. నగర వెండింగ్ కమిటీలో రూరల్‌కు చెందిన స్వాతిని నియమించడం మరింత చర్చకు దారి తీసింది. వీరితో పాటు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన అంధవరపు ప్రసాద్, రెడ్డి గిరిజా శంకర్, ఉంగట రమణ, అల్లు నరససయ్యలకు కూడా కమిటీలో చోటిచ్చారు. టీడీ పీ నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమించగా, చైర్మన్‌గా కమిషనర్, మిగతా హోదాల్లో వివిధ అధికారులను నియమించారు. ఈ నెల ఒకటో తేదీనే కమిటీ వేసినప్పటికీ ఇప్పుడిది తెరపైకి వచ్చింది. కమిటీ సభ్యులంతా ఇప్పటికే ఒకసారి సమావేశమై, వివిధ అంశాలపై చర్చించినట్టు కూడా తెలిసింది.
చక్రం తిప్పేందుకేనా..?
మొత్తానికి పాలకవర్గం లేని కార్పొరేషన్‌లో వెండింగ్ కమిటీ పేరుతో టీడీపీ నాయకులకు ప్లేస్ కల్పించారు. వారంతా ఏం చేస్తారో అన్నదానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా కార్పొరేషన్‌లో గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్ట్రీట్ వెండర్స్ కమి టీలను నియమించారు. ఇప్పుడా జీఓలను పట్టుకు ని టౌన్ వెండింగ్ కమిటీని నియమించినట్టు తెలుస్తోంది. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెండర్స్ పేరు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. వెండర్స్ అంటే సరఫరాదారులు. కానీ, ఇప్పుడు వెండర్స్ అంటే పనులు చేసే వాళ్లుగా చూ పిస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు మాదిరిగా టీడీపీ నాయకులను వెండర్స్‌గా అవతారమెత్తించి, వారిని ప్రత్యేకంగా గుర్తించి, పనులు అప్పగించారు. వారిచేతే పనులు చేపట్టి, బిల్లులు వారికే వేసి లబ్ధి చేకూరుస్తున్నారు. పనుల్లో నాణ్య త, లోపాలు, అక్రమాలు పక్కన పెడితే వెండర్స్‌కు తాజాగా రూరల్ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పనులు కాసులు కురిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌లో తాజాగా నియమించిన టౌన్ వెండింగ్ కమిటీ ఏ రకంగా ఉంటుందో అన్నదానిపై చర్చ జరుగుతోంది. స్ట్రీట్ వెండర్స్ కోసం పనిచేస్తుందా? లేదంటే కార్పొరేషన్‌లో చేపట్టే పనులు, ఇతరత్రా వ్యవహారాలను చూసుకుంటుందా? అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే సతీమణి, నగర కీలక నాయకులే ఉండటంతో కార్పొరేషన్ అంతా వారి కనుసన్నల్లో, డైరెక్షన్‌లో నడిచే అవకాశమైతే మాత్రం ఉంటుంది. వారిని దాటి అక్కడేమీ జరిగే అవకాశం ఉండదని చెప్పొచ్చు.
కొత్త నిర్మాణాల కోసమేనా..?
కార్పొరేషన్‌లో టౌన్ వెండింగ్ కమిటీ ఏర్పాటు
సభ్యులుగా టీడీపీ నాయకుల నియామకం
ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతికి చోటు
వీరితో పాటు నలుగురు నాయకులకు, అధికారులకు కమిటీలో స్థానం
జనసేన, బీజేపీలకు మొండిచేయి

ఆధిపత్యం కోసమేనా..?