
నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు
బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
జూనియర్ ఇంటర్మిడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలతో అగ్రికల్చర్ – క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీలలో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్ https:// mjptbcwreis. telangana.gov.in (ro) https:// mjpabcwreis. cgg.gov.in/ TSMJBCWEB/ లో లేదా 040–23328266 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. బీసీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారు 10వ తరగతి చదివిన గురుకుల స్కూల్‌లో సంబంధిత ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు ఇస్తే సరిపోతుందని వివరించారు.