
విమానంలో దుబాయ్‌కి ప్రయాణం
నేడు మరో ముగ్గురు వెళ్లే అవకాశం
ఎల్‌టీవీలపై వైఖరి చెప్పని కేంద్రం
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్‌టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్‌టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు.
నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్‌టీవీతో వచ్చారు. సైబరాబాద్‌లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్‌లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు.
ఈమె లాంగ్‌టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.