
10 గ్రాముల బంగారం రూ.లక్ష దాటడంతో ప్రజల బెంబేలు
రాష్ట్రవ్యాప్తంగా 50 శాతానికి పైగా తగ్గిన కొనుగోళ్లు
పెట్టుబడి కోసం నాణేలు, బిస్కట్లు కొంటున్న జనం
ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ల బంగారానికి గిరాకీ కరువు.. వెలవెలబోతున్నదుకాణాలు.. వ్యాపారుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వస్తువు ధరలో హెచ్చు తగ్గులు వస్తే వినియోగదారుడు లేదా వ్యాపారిలో ఎవరో ఒకరికి లాభం చేకూరుతుంది. కానీ, బంగారం ధర రూ.లక్ష దాటడం వల్ల అటు కొనుగోలు దారుడు, ఇటు అమ్మకం దారుడు కూడా ఆనందంగా లేకపోవడం గమనార్హం. మంగళవారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.లక్షా 2 వేలకు చేరింది.
గత సంవత్సరం ఇదే సమయంలో రూ.61,000 ఉంది. అంటే ఏడాది కాలంలోనే 62% పెరిగింది. మూడు నెలల క్రితం రూ.80 వేలకు చేరువలో ఉన్న 10 గ్రాముల బంగారం.. 90 రోజుల్లో 20 శాతం పెరిగి రూ.లక్షను దాటింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించక వెలవెలబోతున్నాయి.
50% తగ్గిన అమ్మకాలు
హైదరాబాద్‌లో ధరలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉండేది. అయితే 10 గ్రాముల ధర రూ.80 వేలు దాటినప్పటి నుంచి కొనుగోళ్లు మందగించాయి. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం దుకాణాల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 30 నుంచి 50 శాతం వరకు అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తగ్గుదల 35% దాటిందని జెమ్స్ అండ్ జువెల్లరీ అసోసియేషన్ ప్రకటించింది.
ఆభరణాల కన్నా ‘ముద్ద’గానే..
బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఇష్టం. కానీ, ధర భారీగా పెరగటంతో బంగారాన్ని 22 క్యారట్ల ఆభరణంగా ధరించడం కన్నా భవిష్యత్ పెట్టుబడిగా ‘నిల్వ’చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణంగా చేయిస్తే తరువాత ఎప్పుడైనా విక్రయించేటప్పుడు తరుగు, నాణ్యత, వీఏ పేర్లతో దాని విలువను వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేస్తారు.
అదే బిస్కట్, కడ్డీ రూపంలో ఉంటే విలువలో తేడా ఉండదు. బేగంబజార్‌లోని బంగారం దుకాణాల్లో గత కొద్ది రోజులుగా 24 క్యారట్ల 100 గ్రాముల బంగారం బిస్కట్‌లను ఎక్కువగా విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. 10, 20 గ్రాముల బంగారు బిల్లలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ధరలు అనూహ్యంగా పెరగటంతో ఇళ్లలో ఉన్న బంగారాన్ని కూడా విక్రయించి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు కూడా ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.

వ్యాపారుల్లో ఆందోళన
వివాహాల సీజన్‌లోనూ ప్రజలు పెళ్లిళ్ల బడ్జెట్‌లో బంగారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపెద్ద ఆభరణాల దుకాణాలు ఈఎంఐ స్కీమ్‌లు, మేకింగ్ చార్జీలపై రాయితీలు, పాత బంగారం మార్పిడి మీద అదనపు బెనిఫిట్స్ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి బంగారు ఆభరణాల దుకాణాలు తెరిస్తే ధరల పెరుగుదలతో ప్రజలు తమ దుకాణాల వైపే రావడం లేదని పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యాపారి కొమురవెళ్లి వెంకటరమణా చారి ఆందోళన వ్యక్తం చేశారు.
కొనడానికి ఎవరూ రావడం లేదు
10 గ్రాముల బంగా రం ధర రూ.లక్షకు చేరడంతో బేగంబజార్‌తోపాటు రాష్ట్రమంతటా బంగారం వ్యాపారం పడిపో యింది. బంగారం కొనడానికి ఎవరూ రావడం లేదు. మూడు నెలల్లోనే దాదాపు 50 శాతం కన్నా ఎక్కువే అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు సాధా రణ స్థితికి రావడం ఇప్పట్లో కష్టమే. – కంకర్ల రాకేశ్,బంగారం వ్యాపారి, బేగంబజార్
ఖాళీగా కూర్చుంటున్నాం
బంగారం ధరలు పెరగడంతో గిరాకీ తగ్గింది. పెళ్లిళ్లు, శుభ కార్యాలయాలకు కూడా ఆభరణాలు చేయించుకోవడానికి జనం రావడం లేదు. కరీంనగర్‌లో ఎప్పుడూ కళకళలాడే ఆభరణాల దుకాణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 22 క్యారట్ల ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం బంగారు పరిశ్రమ మీద ఆధారపడ్డ వారిని అంధకారంలోకి నెడుతోంది. – ఈశ్వరోజు వెంకటేశ్వర్లు,రాఘవేంద్ర జ్యువెల్లర్స్, కరీంనగర్