
కార్యకర్తల పార్టీ బీజేపీ
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
శంకర్‌పల్లి: భారతీయ జనతా పార్టీ లీడర్ల పార్టీ కాదని, కార్యకర్తల పార్టీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గురువారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పార్టీ మండల, మున్సిపల్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని, మిగతా పార్టీల్లా మీడియాలో కనిపించేందుకు ఆసక్తి చూపించదని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులు కేటాయిస్తున్నప్పటికీ శిలాఫలకాలు వేసుకొని క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందని విమర్శించారు. కార్యకర్తలు గ్రామస్థాయిలో ఇంటింటికీ తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జిలు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాష్, శంకర్‌పల్లి మండల అధ్యక్షురాలు లీలావతి, మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.