
లగచర్ల రైతులకు చెక్కులు
● 45 మందికి రూ.17.89 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ ● సబ్ కలెక్టర్ చేతులమీదుగా నిర్వాసితులకు అందజేత
దుద్యాల్: పారిశ్రామిక వాడ ఏర్పాటులో భూములు కోల్పోతున్న లచగర్ల రైతులకు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గురువారం చెక్కులు పంపిణీ చేశారు. 45 మందికి సంబంధించిన 89.19 ఎకరాల పట్టా భూములకు చెందిన రూ.17 కోట్ల 89 లక్షల 50 వేల విలువైన చెక్కులను నిర్వాసితులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. చాలా మంది రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. పరిహారం విషయంలో రైతులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని, ప్రభుత్వం అందరికీ సమానంగా ఇస్తోందని తెలిపారు. మిగిలిన రైతులు కూడా భూములు అప్పగించి, పరిహారం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దుద్యాల్ తహసీల్దార్ కిషన్, రెవెన్యూ అధికారులు, లగచర్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.