
పైకప్పు.. ముప్పు
తరచూ పెచ్చులూడుతున్న పాఠశాలల స్లాబులు
● గాయపడుతున్న విద్యార్థులు ● గతంలో దుద్యాల్.. తాజాగా ధారూరు మండలంలో ఘటనలు ● ఆందోళనలో విద్యార్థులు, తల్లిండ్రులు
మరీ ఇంత నిర్లక్ష్యమా?
వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది భద్రతకు రక్షణ కరువైంది. స్కూల్ భవనాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు చేపడుతున్నా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల క్రితం దుద్యాల్ మండలం హస్నాబాద్ ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడి విద్యార్థులు పరుగులు తీసిన ఘటన మరువక ముందే బుధవారం ధారూరు మండలం మున్నూరు సోమారం పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు కావడం కలకలం రేపింది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అయితే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో మన ఊరు – మన బడి పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా ఆదర్శ పాఠశాలల పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసింది. కానీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పనులు చేశారనే విమర్శలు ఉన్నాయి.
అన్ని పాఠశాలల్లో పూర్తయిన పనులు
జిల్లాలో మొత్తం 1,062 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు – మనబడి కార్యక్రమం కింద గత ప్రభుత్వం మొదటి విడతలో 371 పాఠశాలలను ఎంపిక చేసింది. 46 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా 92 స్కూళ్లలో పనులు మధ్యలో ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మా ఆదర్శ పాఠశాలల పేరిట ఒకే విడతలో 924 స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.35.5 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తయ్యాయి.
ఆందోళనలో తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్ హరిజన వాడ ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగి మూడు నెలలు దాటినా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.. అప్పట్లో క్లాసులు జరుగుతున్న సమయంలో పా ఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటి కి పరుగులు తీసిన విషయం తెలిసిందే.. ప్రమా దం జరిగిన సమయంలో ఉపాధ్యాయురాలు కీర్తి, 41 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్ట వ శాత్తు ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు.. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు పత్రికల్లో రావడంతో హుటాహుటిన అధికారులు పాఠశాలను సందర్శించి మరమ్మతు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మూడు నెలలు దాటినా కనీస మరమ్మతులు కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నాసిరకంగా పనులు
పాఠశాల భవనాలు నిర్మించే సమయంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. చిన్నపాటి వర్షాలకే పైకప్పుల నుంచి నీరు కారుతోంది. మరమ్మతులు చేపట్టిన కొన్ని నెలలకే భవనాలు దెబ్బతింటున్నాయి.
– బిల్లపాటి యాదయ్య, విద్యార్థిని తండ్రి, ధారూరు
పునరావృతం కావొద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి కొత్త వాటిని నిర్మించాలి.
– మేకల భిక్షపతి, విద్యార్థి తండ్రి, మున్నూరుసోమారం

పైకప్పు.. ముప్పు

పైకప్పు.. ముప్పు