pellet guns
-
ప్రాణాలు తీయని ఆయుధాలున్నాయా !
న్యూఢిల్లీ: కశ్మీర్లో రాళ్లు రువ్వే మూకలను నియంత్రించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా కళ్లు పోవడమే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నందున ప్రాణాంతకంకానీ, హాని కలిగించని ప్రత్యామ్నాయ ఆయుధాలను ఉపయోగించాలని కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ఓ ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అలాంటి ప్రత్యామ్నాయ ఆయుధాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఆందోళనలను నియంత్రించేందుకు లేదా అదుపు చేసేందుకు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. కశ్మీర్లో మన భద్రతా దళాలు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ వల్ల వందలాది మంది ఆందోళనకారులకు శాశ్వతంగా కళ్లుపోవడం, ఏటీఎం వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు 21 ఏళ్ల రియాజ్ అహ్మద్ షా లాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మనకు తెల్సిందే. పెల్లెట్ గన్స్ ఒక్క భారత దేశం మాత్రమే ఉపయోగించడం లేదు. మనలాగే మరికొన్ని దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఈజిప్టు పోలీసులు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించడం వల్ల 31 ఏళ్ల షైమా ఎల్ షబాగ్ అనే అమాయక వ్యక్తి మరణించారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారికి ఈజిప్టు ప్రభుత్వం 2015లో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్ రబ్బర్ కోటెడ్ పెల్లెట్స్‌ను ప్రయోగించడం వల్ల 12 మంది అరబ్-ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. దీనిపై వేసిన దర్యాప్తు కమిషన్ సిఫార్సు మేరకు ఇజ్రాయెల్ ఈ పెల్లెట్స్ ప్రయోగాన్ని నిషేధించింది. భారత హోం శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా పెల్లెట్ల ప్రయోగాన్ని నిషేధించి, వాటి స్థానంలో ‘పెలార్గానిక్ ఆసిడ్ వానిల్లి అమైడ్ షెల్స్’ను ఉపయోగించాలని సిఫార్సు చేసినట్లు తెల్సింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మిర్యాల పొడికి ఘాటైన రూపం లేదా సాంద్రీకరించిన మిర్యాల పొడి. 1980లోనే దీన్ని అమెరికా అభివద్ధి చేసింది. మొదట దీన్ని క్రూరమైన ఖడ్గ మగాలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయోగించేవారు. ఆ తర్వాత క్రౌడ్ కంట్రోల్‌కు కూడా ఉపయోగిస్తూ వచ్చారు. దీని వల్ల కూడా కళ్లకు, ఊపిరితిత్తులకు, గుండెకు హాని కలుగుతుంది. కండోర్ రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రత్యామ్నాయ ఆయుధంగా వాడొచ్చని భారత కమిటీ సూచించినట్లు తెల్సింది. 1970లో పెల్లెట్లకంటె పెద్దవైన ఈ రబ్బర్ బుల్లెట్లను బ్రిటన్ అభివద్ధి చేసింది. ఉత్తర ఐర్లాండ్‌లో ఆందోళనలను అరికట్టేందుకు బ్రిటన్ బలగాలు వీటిని ఉపయోగించేవి. వీటిని ఆందోళనకారుల కాళ్ల ముందు ప్రయోగించినట్లయితే నేల మీద తగిలి వారి కాళ్లకు తగులుతాయి. కాళ్లపై తాత్కాలిక గాయాలవుతాయి. కానీ నేరుగా కాళ్లపై ప్రయోగించినట్లయితే కాళ్ల ఎముకలు విరిగిపోయి శాశ్వత అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. తగలరాని చోట తగిలితే ప్రాణాలు కూడా పోతాయి. దాంతో ఈ రబ్బర్ బుల్లెట్ల వాడకాన్ని 1975లో బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇప్పటికీ కొన్ని దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. 2015లో నేపాల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి అక్కడి భద్రతా బలగాలు ఈ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం వల్ల ఓ బాలుడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. అమెరికాలో కూడా వీటిని ప్రయోగించడం వల్ల పౌరులకు తీవ్ర గాయాలైన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆందోళనలను అరికట్టేందుకు ‘స్టన్ గ్రెనేడ్స్’ను ఉపయోగిస్తున్నారు. కనుక మరో ప్రత్యామ్నాయంగా ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని భారత కమిటీ సూచించింది. వీటిని జనం మధ్యకు ప్రయోగించినప్పుడు భారీ శబ్దంతో పేలుతాయి. తాత్కాలికంగా ఆందోళనకారులకు కళ్లు కనిపించకుండా, చెవులు వినిపించకుండా పోతాయి. వీటివల్ల చెవుల్లోని కర్ణభేరీలు శాశ్వతంగా దెబ్బతినడమే కాకుండా, ఊపిరితిత్తుల్లోని మదువైన పొరల కూడా శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రాణాంతకంకానీ, పౌరులకు హాని చేయని ఆయుధం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. టియర్ గ్యాసెస్‌ను గుడ్డిగా ప్రయోగించినా ప్రమాదం లేకపోలేదు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు మార్గమేది? అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఓ అంశం మీద ఆందోళన చేయడం పౌరుల ప్రజాస్వామ్య హక్కుని ప్రభుత్వాలు గుర్తించి వారి ఆందోళనలకు కారణమవుతున్న అంశాలను పరిష్కరించడమే అన్నింటికన్నా ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాన్ని ప్రయోగించాల్సి వచ్చినప్పుడు అది ఏ ఆయుధం ఉపయోగిస్తున్నారన్న దానికన్నా ఆ ఆయుధాన్ని ఎంత బాధ్యాతాయుతంగా ఉపయోగిస్తున్నారన్నది ముఖ్యం. అందుకు అమాయకులు బాధితులవుతే అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయడం అంతకన్నా ముఖ్యం. ఈజిప్టులో లాగా అందుకు బాధ్యులైన అధికారులను శిక్షిస్తే వారిలో బాధ్యత పెరుగుతుంది. -
'పెల్లెట్ గన్స్‌ను నిషేధించండి'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు వినియోగిస్తున్న పెల్లెట్ గన్స్‌ను వెంటనే నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. భద్రతాబలగాలు అల్లర్లను నియంత్రించడానికి పెల్లెట్ గన్స్ వాడటం మూలంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో యువత తీవ్రంగా గాయపడినట్లు విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ప్రధానికి మెమొరాండం సమర్పించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న వారితో చర్చలు ప్రారంభించి శాంతిపూర్వక వాతావరణం నెలకొల్పాలని వారు కోరారు. హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ నేపథ్యంలో చెలరేగిన హింసతో కశ్మీర్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు జవాన్లతో పాటు 60 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ఇప్పటికీ శ్రీనగర్‌తో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. -
పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి
-
పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి
గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సీఆర్పీఎఫ్ తెలిపింది. కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ల వాడకాన్ని నిషేధించాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి సమాధానంగా సీఆర్పీఎఫ్ ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలిపింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడంతో పెల్లెట్ గన్ల వాడకం పెరిగిన విషయం తెలిసిందే. అల్లర్లను నియంత్రించడానికి రబ్బరు పెల్లెట్ల వాడకాన్ని 2010 నుంచి మొదలుపెట్టారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో భాగంగా దీన్ని కూడా చేర్చారు. సాధారణంగా ఎస్ఓపీలో భాగంగా పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్ని విషమ పరిస్థితుల్లో నియంత్రించాలంటే తప్పనిసరై తుపాకులు వాడాల్సి వచ్చినా, నడుం కింది భాగంలోనే కాల్చాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో జనం ఒకచోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుంటారని, అలాంటప్పుడు సరిగ్గా గురిచూసి కాల్చడం సాధ్యం కాదని సీఆర్పీఎఫ్ తెలిపింది. జూలై 9 నుంచి ఆగస్టు 11 వరకు నిరసనకారులను అణిచేందుకు తాము 3,500 పెల్లెట్ కార్ట్రిడ్జిలను వాడినట్లు వివరించింది. జమ్ము కశ్మీర్ బార్ అసోసియేషన్ దాఖలుచేసిన పిల్ విచారణలో భాగంగా సీఆర్పీఎఫ్ ఈ అఫిడవిట్ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన సమాధానాన్ని చెప్పాల్సి ఉంది. -
'పెల్లెట్ గన్స్కు చట్టంలో చోటు లేదు'
న్యూఢిల్లీ: ప్రపంచ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ జమ్మూకశ్మీర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలో ఆందోళన కారులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించడం మానుకోవాలని సూచించింది. వీటి వల్ల వందలమంది అంధులు మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 'పెల్లెట్ గన్స్ ఉపయోగించడం ఒక రకంగా బయటకు కనిపించని వివక్షలాంటిదే. అలాంటి వాటికి ఏ చట్టాల్లోను చోటు లేదు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా సీనియర్ ప్రచారకర్త జహూర్ వాని అన్నారు. ఆందోళనలను అదుపులోకి తెచ్చే పేరిట పెల్లెట్ గన్స్ ఉపయోగించవద్దని మేం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని చెప్పారు. -
’పాక్ వేలుపెట్టడం ఆపేస్తే మంచిది’
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ భారత్‌కు చాలా ముఖ్యమని, అక్కడి ప్రజల భద్రత తమ ప్రధాన అంశమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలు, వాటివల్ల సామాన్యులకు జరిగిన నష్టం ప్రతి ఒక్క భారతీయుడిని బాధించిందని అన్నారు. పాక్ మూలంగానే ఇదంతా నెలకొందని చెప్పారు. పెల్లెట్ల కారణంగా కశ్మీర్ లో ఎంతోమంది యువకులు గాయపడ్డారని, వాటిని ఉపయోగించాలా వద్దా అనే అంశంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంశం అని ఆయన గుర్తు చేశారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. తాను పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తనకు నీరాజనాలు పలికారని, పాక్ మాత్రమే కశ్మీర్ యువకులను పక్కదోవపట్టి తుపాకులు చేతబట్టేలా చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ఉగ్రవాద సమస్యతో బాధపడుతున్న ఆ దేశం తన సమస్యలు తాను చూసుకుంటే మంచిదని, భారత్ అంతరంగిక విషయాల్లో వేలుపెట్టడం మానుకోవాలని అన్నారు. పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారికి ఢిల్లీలో ఉచిత వైద్యం ఇప్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చామని ఆయన చెప్పారు. ఉపాధి లేమి, ఆర్థిక బలహీనత కశ్మీర్ లో అశాంతికి కారణంగా మారుతున్నాయని, వాటిని పారద్రోలేందుకు కూడా ప్రధాని ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించారని గుర్తు చేశారు. -
సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి...
న్యూఢిల్లీ: కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఓ సంస్థ ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది. భారతీయ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిపై పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వారు నిరసిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ నేతలు, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఐశ్వర్యారాయ్, సోనియా గాంధీ, జుకర్ బర్గ్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్ తదితర ప్రముఖుల ఫోటోలతో పెల్లెట్ గన్ ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పోస్టులలో రాశారు. ఫోటోలలో పెల్లెట్ గన్ ల కారణంగా సెలబ్రిటీల ముఖానికి, కళ్లకు గాయాలైనట్లు మార్ఫింగ్ చేశారు. కశ్మీర్ కల్లోలంపై పాకిస్తాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఫోటోలు ఆన్ లైన్ లో విడుదలవ్వడం గమనార్హం. కాగా, పాక్ వ్యాఖ్యాలపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ ప్రజలల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా పాక్ వ్యాఖ్యలను చేయకూడదని సూచించారు. కశ్మీర్ లో రెండ్రోజుల పర్యటన ముగించుకున్న రాజ్ నాథ్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. పోలీసు బలగాలపై కశ్మీర్ యువత రాళ్లు విసరొద్దని, యువకులపై తొందరపడి పెల్లెట్ గన్ లు ఉపయోగించొద్దని భధ్రతా దళాలను ఆయన కోరారు. ఈనెల 8న టెర్రరిస్టు బుర్హాన్ వానీ కాల్చివేత అనంతరం రాజుకున్న కశ్మీర్ కల్లోలంలో ఇప్పటివరకు 45మంది మరణించారు. -
'రాళ్లు విసరొద్దు.. గన్స్ పేలొద్దు'
-
కశ్మీరీలతో ఉద్విగ్న బంధం
రాజ్‌నాథ్ ఆకాంక్ష పాక్ పద్ధతి మార్చుకోవాలని ధ్వజం శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలతో కేంద్రం ఉద్విగ్న సంబంధాలను కోరుకుంటోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్లో పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహకరించాలని కశ్మీరీలను కోరారు. ఘర్షణల నేపథ్యంలో శ్రీనగర్, అనంతనాగ్‌లలో రెండు రోజులపాటు రాజ్‌నాథ్ పర్యటించారు. సీఎం మెహబూబా ముఫ్తీ, విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌తో చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పాక్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సాధ్యమైనంత వరకు పెల్లెట్ గన్స్‌ను వాడకుండానే ఆందోళనకారులను నియంత్రించాలని భద్రతా దళాలను ఆదేశించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్ యువత ఆయుధాలు చేతబట్టేలా పాక్ పురిగొల్పుతోందని, దీన్ని విడనాడాలని సీఎం మెహబూబాఅన్నారు. కశ్మీర్ ఘర్షణల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు -
'రాళ్లు విసరొద్దు.. గన్స్ పేలొద్దు'
శ్రీనగర్: దయచేసి యువకులు ఎవరూ బలగాలపై రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేయొద్దని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అదే సమయంలో పోలీసు బలగాలు అల్లర్లు నియంత్రించే సమయంలో పెల్లెట్ గన్లు ఉపయోగించరాదని చెప్పారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం పాకిస్థాన్ అని, ఈ విషయంలో తాము ఒక గట్టి నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కశ్మీర్ లో ఎప్పటి మాదిరిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 'కశ్మీర్ లో పరిస్థితిపట్ల మూడో వర్గానికి(పాకిస్థాన్) ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా సమస్య ఉంటే మనమంతా కూర్చుని చర్చించుకుందాం' అని రాజ్ నాథ్ అన్నారు. పాకిస్థాన్ ప్రలోభాలకు కశ్మీర్ యువతి గురికావొద్దని, అనవసరం ఉగ్రవాద భావజాలం మాయలో పడొద్దని హెచ్చరించారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీతో మాట్లాడానని, ఆమె గాయపడి వైద్య ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వం తరుపున ఉచిత చికిత్స అందించే ఏర్పాట్లుకూడా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్ లో వైద్యం చేయిస్తామని ఆయన అన్నారు. -
‘పెల్లెట్ గన్స్‌ను వాడొద్దు’
శ్రీనగర్: శాంతి భద్రతల నియంత్రణ సందర్భంగా జనంపై పెల్లెట్ గన్స్ వాడడం మానుకోవాలని జమ్మూకశ్మీర్ సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. వీటికి ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పార్లమెంటులో చేసిన ప్రకటనను ప్రస్తావించింది. పెల్లెట్ గన్స్ ప్రాణాంతకమనే మంత్రి మాటలకు అర్థమని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొంది. పెల్లెట్ గన్ దాడిలో కళ్లకు తీవ్ర గాయాలైన ఐదేళ్ల బాలుడి ఫొటోలను ప్రస్తావిస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ బాలుడు రాళ్లతో దాడి చేశాడని నిందించజాలరని, ఒక వ్యక్తి కళ్లు కోల్పోతే, సమస్తాన్నీ కోల్పోయినట్లేనని పేర్కొంది. ఇదిలా ఉండగా బందిపొరా, బారాముల్లా, బడ్గామ్, గండర్బల్ జిల్లాల్లో, శ్రీనగర్‌లో పలుచోట్ల సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కర్ఫ్యూ తొలగించారు. అనిశ్చిత కశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఆదివారం ఆయన రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజాసంఘాల నేతలతో చర్చలు జరిపారు.