పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి
గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సీఆర్పీఎఫ్ తెలిపింది. కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ల వాడకాన్ని నిషేధించాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి సమాధానంగా సీఆర్పీఎఫ్ ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలిపింది.
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడంతో పెల్లెట్ గన్ల వాడకం పెరిగిన విషయం తెలిసిందే. అల్లర్లను నియంత్రించడానికి రబ్బరు పెల్లెట్ల వాడకాన్ని 2010 నుంచి మొదలుపెట్టారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో భాగంగా దీన్ని కూడా చేర్చారు. సాధారణంగా ఎస్‌ఓపీలో భాగంగా పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్ని విషమ పరిస్థితుల్లో నియంత్రించాలంటే తప్పనిసరై తుపాకులు వాడాల్సి వచ్చినా, నడుం కింది భాగంలోనే కాల్చాల్సి ఉంటుంది.
కానీ ఇలాంటి సందర్భాల్లో జనం ఒకచోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుంటారని, అలాంటప్పుడు సరిగ్గా గురిచూసి కాల్చడం సాధ్యం కాదని సీఆర్పీఎఫ్ తెలిపింది. జూలై 9 నుంచి ఆగస్టు 11 వరకు నిరసనకారులను అణిచేందుకు తాము 3,500 పెల్లెట్ కార్ట్రిడ్జిలను వాడినట్లు వివరించింది. జమ్ము కశ్మీర్ బార్ అసోసియేషన్ దాఖలుచేసిన పిల్ విచారణలో భాగంగా సీఆర్పీఎఫ్ ఈ అఫిడవిట్ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన సమాధానాన్ని చెప్పాల్సి ఉంది.