Burhan Wani encounter
-
పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి
-
పెల్లెట్లు వద్దంటే మేం బుల్లెట్లు వాడాలి
గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి పెల్లెట్లు వాడొద్దని చెబితే.. తమ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా బుల్లెట్లు వాడాల్సి వస్తుందని, వాటివల్ల మరిన్ని ప్రాణాలు పోతాయని జమ్ము కశ్మీర్ హైకోర్టుకు సీఆర్పీఎఫ్ తెలిపింది. పరిస్థితులను నియంత్రించడానికి సీఆర్పీఎఫ్ వద్ద మరో అవకాశం ఏమీ ఉండబోదని, తప్పనిసరిగా రైఫిళ్లతో కాల్పులు జరపాల్సి వస్తే, అప్పుడు మరిన్ని ప్రాణాలు పోతాయని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సీఆర్పీఎఫ్ తెలిపింది. కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్ల వాడకాన్ని నిషేధించాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యానికి సమాధానంగా సీఆర్పీఎఫ్ ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలిపింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడంతో పెల్లెట్ గన్ల వాడకం పెరిగిన విషయం తెలిసిందే. అల్లర్లను నియంత్రించడానికి రబ్బరు పెల్లెట్ల వాడకాన్ని 2010 నుంచి మొదలుపెట్టారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో భాగంగా దీన్ని కూడా చేర్చారు. సాధారణంగా ఎస్ఓపీలో భాగంగా పెద్ద ఎత్తున గుమిగూడిన జనాన్ని విషమ పరిస్థితుల్లో నియంత్రించాలంటే తప్పనిసరై తుపాకులు వాడాల్సి వచ్చినా, నడుం కింది భాగంలోనే కాల్చాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో జనం ఒకచోట ఉండకుండా అటూ ఇటూ తిరుగుతుంటారని, అలాంటప్పుడు సరిగ్గా గురిచూసి కాల్చడం సాధ్యం కాదని సీఆర్పీఎఫ్ తెలిపింది. జూలై 9 నుంచి ఆగస్టు 11 వరకు నిరసనకారులను అణిచేందుకు తాము 3,500 పెల్లెట్ కార్ట్రిడ్జిలను వాడినట్లు వివరించింది. జమ్ము కశ్మీర్ బార్ అసోసియేషన్ దాఖలుచేసిన పిల్ విచారణలో భాగంగా సీఆర్పీఎఫ్ ఈ అఫిడవిట్ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన సమాధానాన్ని చెప్పాల్సి ఉంది. -
ఆ ఎన్కౌంటర్ యాక్సిడెంటలా?
శ్రీనగర్: వాటెండ్ టెర్రరిస్టు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్కౌంటర్ జమ్మూకశ్మీర్లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. బుర్హాన్ వని ఎన్కౌంటర్పై తాజాగా డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్ కూడా స్పందించారు. ఈ ఎన్కౌంటర్ యాక్సిడెంట్ (యాదృచ్ఛికం) మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ముందే సమాచారం అంది ఉంటే తాము ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండేవాళ్లమని ఆయన పేర్కొన్నారు. సీఎం మెహబూబా ముఫ్తి గతంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లాలోని బాందూరా గ్రామంలో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టిన ఇంట్లో బుర్హాన్ వని ఉన్నాడని తమకు ముందుగానే తెలిసి ఉంటే, అతనికి భద్రతా దళాలు ఒక అవకాశం (లొంగిపోయేందుకు?) ఇచ్చి ఉండేవని ఆమె పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో గతంలో బీజేపీ విభేదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ వ్యాఖ్యలు వివాదం రేపాయి. దీంతో స్పందించిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగి.. 40మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. -
పత్రికలపైనా నిషేధం!
మంచుకొండలతో ఎప్పుడూ చల్లగా ఉండే కశ్మీరం ఇప్పుడు రగిలిపోతోంది. గత కొన్నాళ్లుగా అక్కడ చెలరేగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి తప్ప చల్లారడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన బుర్హాన్ వనీ అనే ఉగ్రవాదిని భద్రతాదళాలు కాల్చి చంపడంతో మొదలైన ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ను ఆపేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాంతో మూడు రోజుల పాటు పత్రికలు కూడా ఏవీ విడుదల కాకుండా అక్కడ ఆపేశారు. అధికారులు చెప్పిన మూడు రోజుల గడువు ముగిసిపోయినా కూడా మంగళవారం సైతం జమ్ము కశ్మీర్లో పత్రికలేవీ బయటకు విడుదల కాలేదు. నిషేధం ఎత్తేయాలన్న నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం తర్వాత ప్రకటించడంతో.. అప్పటికప్పుడు మంగళవారం ఎడిషన్ తీసుకురావడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో పత్రికలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. పత్రికలపై నిషేధం విధించిన విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియలేదని సమాచారం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బాధ్యతలను కొత్తగా చేపట్టిన వెంకయ్యనాయుడు ఈ అంశంపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఫోన్ చేసి విచారించారు. నిషేధం ఏమైనా ఉందా అని అడిగితే.. ఇప్పుడేమీ లేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ గత నాలుగు రోజులుగా కశ్మీర్లో ఎక్కడా పత్రికలు విడుదల కాలేదు. అంటే ఇదంతా అప్రకటిత నిషేధమా అన్నది తెలియాల్సి ఉంది. పత్రికల నిషేధం అంశానికి ముఖ్యమంత్రి అనుమతి కూడా లేదని మెహబూబా ముఫ్తీ రాజకీయ సలహాదారు అమితాబ్ మట్టూ చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకోక తప్పలపేదని సీనియర్ మంత్రి నయీమ్ అఖ్తర్ అన్నారు. శనివారం తెల్లవారుజామున పోలీసులు పత్రికల కాపీలను సీజ్ చేయడంతో అప్పటినుంచి పత్రికల ప్రచురణ ఆగిపోయింది. జూలై 8వ తేదీన భద్రతాదళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మరణించాడు. అప్పటి నుంచి కశ్మీర్లో హింసాత్మక ఘటనలు పెచ్చుమీరాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ యువతి కూడా మంగళవారం మరణించింది. -
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!) అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత) బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.