
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!)
అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత)
బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.