tence
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
-
అట్టుడుకుతోన్న కశ్మీర్ లోయ..
శ్రీనగర్: ఆందోళనకారుల రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ కు నిరసనగా లోయలోని కుల్గాం, అనంత్ నాగ్, బారాముల్లా జిల్లాల్లో జరుగుతోన్న ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై రాళ్లు రువ్వారు. కుల్గాం లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నిరసనకారుల్ని అదుపుచేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. (చదవండి: ఈ టెర్రరిస్టు ఒక్కరిని కూడా చంపలేదు!) అనంతనాగ్ జిల్లాలోని బందిపోరా, ఖాజిగుండ్, లర్నోలో, కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, దమ్హాల్ ప్రాంతాల్లో, అనంత్ నాగ్ జిల్లాలోని వార్పోరాలో ఆందోళనకారుల ఉధృతి తీవ్రంగా ఉందని, దక్షిణ కశ్మీర్ లోని ఓ మైనారిటీల నివాస సముదాయం వద్ద పహారా కాస్తున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని పోలీస్ అధికారులు చెప్పారు. (చదవండి: అమర్ నాథ్ యాత్ర నిలిపివేత) బుర్హాన్ ఎన్ కౌంటర్ నిరసనల వేడి శ్రీనగర్ ను కూడా రగిలిస్తుండటంతో అధికారులు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అమర్ నాథ్ యాత్ర ఆసాంతం కశ్మీర్ లోయ గుండా సాగాల్సిఉండగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఆర్ఫీఎప్ డీజీ దుర్గా ప్రసాద్ తెలిపారు. మరోవైపు అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
మళ్లీ జాట్ల లొల్లి: హరియాణాలో ఉద్రిక్తత
చండీగఢ్: ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లను అమలుచేయడంతోపాటు, కోటా శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ హరియాణాలోని జాట్ కులస్తులు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఆదివారం నుంచి 15 రోజుల పాటు నిరవధిక ఆందోళనలను నిర్వహించాలన్న ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి(ఏఐజేఏఎస్ఎస్) పిలుపు మేరకు వేల మంది జాట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు నేటి నుంచి జరగనున్న ఉద్యమం విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళన కారులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు అధికారులు ప్రణాలికలు రచించారు. ఇందుకోసం 55 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపడమేకాక చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న జాజ్జర్, సోనిపట్, రోహ్ తక్, పానిపట్, హిసార్, ఫతేహాబాద్, జింద్, ఖైతాల్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. ఈ పరస్థితుల నడుమ హరియాణాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమను ఓబీసీ కేటగిరీలో చేర్చాలంటూ ఫిబ్రవరిలో జాట్లు నిర్వహించిన ఆందోళనలు హింసాయుతంగా మారడం, అల్లర్లలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి ఉద్యమం ఫలితంగా జాట్లకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు లభించాయి. అయితే ఆ ఉత్తర్వులపై పంజాబ్ హైకోర్టు స్టే ఇవ్వడంతో జాట్లు మళ్లీ ఆందోళనబాట పట్టారు. ప్రకటించిన రిజ్వేషన్లను వెంటనే అమలుచేయాలనడమేకాక రిజర్వేషన్ శాతాన్ని పెంచాలనే కొత్త డిమాండ్ తో జాట్లు ఆందోళన చేపట్టారు. -
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
- నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదాతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు, నిరుద్యోగులు అసెంబ్లీకి చేరుకోకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడమే కాక లాఠీలకు సైతం పనిచెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా అసెంబ్లీ వరకు చేపట్టిన ర్యాలీని కళాశాల దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన నిరుద్యోగులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు భీంరావునాయక్, బండి నరేశ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో రవి అనే ఓ టీవీ చానల్ కరస్పాండెంట్‌కి గాయాలయ్యాయి. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ లక్ష ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచి పరీక్ష వాయిదా వేయాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చే యాలని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రంథాలయానికి తాళం.. చలో అసెంబ్లీ నేపథ్యంలో అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని ఉదయం 6 గంటలకే పోలీసులు మూసేశారు. గ్రంథాలయం ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తారని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా తాళాలు వేశారు. గ్రంథాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో నిరుద్యోగులు.. పోలీసుల కళ్లుగప్పి ఒక్కొక్కరుగా అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దపెట్టున నినదిస్తూ అసెంబ్లీ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతోపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మరో 12 మంది గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల అణచివేత దారుణం..: ఆర్.కృష్ణయ్య నిరుద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ప్రభుత్వం పోలీసులతో అణచివేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. నిరుద్యోగులు అరెస్టయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నవారిపై నిరంకుశంగా ప్రవర్తిం చడం ఏమిటని ప్ర శ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో నిరుద్యోగు లు ఉండగా.. కేవలం 439 గ్రూప్-2 పో స్టులను భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. -
మణిపూర్ ఉద్రిక్తతలు
చిన్న నిప్పు రవ్వ కూడా పెను మంటల్ని రగిలించగల ఈశాన్య ప్రాంతంలో ఒక బిల్లు నాలుగు నెలలుగా మణిపూర్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదంటే వింతేమీ లేదు. ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడినట్టు కనిపిస్తున్నా అది తాత్కాలికమేనని చాలామంది అంటున్నారు. రాష్ట్రానికొచ్చే సందర్శకులు, తాత్కాలికంగా నివసించడానికొచ్చేవారూ, వలసలనూ క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును మార్చి 13న ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్థానిక మెయితీ తెగ పౌరుల రక్షణకు ఇది ఏమాత్రం ఉపయోగపడదని, దీనికి బదులు అరుణాచల్, నాగాలాండ్, మిజోరంలో ఉన్నట్టుగా స్థానికేతరుల కదలికలను పూర్తిగా నియంత్రించే ఇన్నర్‌లైన్ పర్మిట్ వ్యవస్థ(ఐఎల్‌పీఎస్) ఉండాలని మెయితీ తెగ డిమాండ్ చేస్తోంది. అందుకు మద్దతుగా కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆందోళన సాగిస్తోంది. దాంతో క్రమబద్ధీకరణ బిల్లును ఉపసంహరించుకుంటామని, ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నట్టు ఐఎల్‌పీఎస్ బిల్లు తీసుకొస్తామని ఇబోబి ప్రకటించారు. అయినా ఆందోళనలింకా చల్లారలేదు. మరోపక్క ఆ బిల్లు తమ ఉనికిని దెబ్బతీయవచ్చునని మైనారిటీ తెగలు ఆందోళనపడుతున్నాయి. ఇబోబి చెప్పినట్టు వచ్చే నెలకల్లా ఐఎల్‌పీఎస్ బిల్లు సిద్ధమైతే మైనారిటీ తెగలు రోడ్డెక్కడం ఖాయం. తెగల కుంపటిగా తయారైన మణిపూర్‌లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలికంగా ఏదో ఒక పరిష్కారాన్ని సాధించడం... అక్కడితో తమ పని అయిందన్నట్టు చేతులు దులుపుకోవడం పాలకులకు అలవాటైంది. కనుక మణిపూర్ ప్రశాంతంగా ఉండటం చాలా అరుదు. ఒక ఏడాది కాలంలో అక్కడ జరిగే బంద్‌లు... దేశం మొత్తంలో అదే కాలంలో జరిగే బంద్లకన్నా ఎప్పుడూ ఎక్కువే. పైగా ఇవి ఒక రోజుకో, పూటకో పరిమితమై ఉండవు. వారాల తరబడి జరుగుతాయి. అంతకాలమూ రాష్ట్రం స్తంభించిపోతుంది. ఈమధ్యే ఇలాంటి బంద్‌లో చిక్కుకుని ఒక మహిళ కారులోనే ప్రసవించాల్సివచ్చింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వరదలొస్తే సహాయ బృందాలు అక్కడికెళ్లడానికి వీలు చిక్కలేదు. ఏ చిన్న సమస్య అయినా రోడ్డెక్కితే తప్ప పరిష్కారం కాదన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా పాతుకుపోవడంవల్లనే బంద్‌లు అక్కడ నిత్యకృత్యమవుతున్నాయి. వీటిని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ రెండు నెలలక్రితం ప్రకటించారు. నిజంగా ఆయన ఆ పని చేస్తే దానికి నిరసనగా మరో సుదీర్ఘమైన బంద్ ఖాయం. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకో గలిగితే అందరికీ ఉపాధి లభిస్తుంది. వలసలు సైతం తగ్గుతాయి. కానీ ఆ ప్రాంతాన్ని సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన పర్యవసానంగా అక్కడ నిరుద్యోగం రాజ్యమేలుతున్నది. ఒక్క మణిపూర్ సంగతే తీసుకుంటే రాష్ట్ర జనాభా 26 లక్షలుంటే అందులో 30 శాతంమంది నిరుద్యోగులు. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యుల శాతం 79! అయినా అదేమీ కడుపు నింపడంలేదు. పరిమితంగా ఉండే అవకాశాలను అనేకమందితో పంచుకోవాల్సి రావడంవల్ల పోటీకొచ్చేవారిని శత్రువులుగా జమకట్టే మనస్తత్వం పెరుగుతోంది. తమ ప్రయోజనాలను ఎక్కడ దెబ్బతీస్తారోనన్న భయంతో అవతలివారిని బెదరగొట్టడం, వారికి అవకాశాల్లేకుండా చేయడం ఎక్కువవుతోంది. ఇదంతా అన్ని తెగల్లోనూ తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నది. పర్యవసానంగానే అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మిలిటెంట్ సంస్థలకు ప్రాణం పోస్తున్నాయి. మణిపూర్‌లో దాదాపు 58 తిరుగుబాటు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ఉద్యమాలు, వసూళ్లు, ఆ క్రమంలో వాటిమధ్య సాగే అంతర్గత పోరు మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. ఇప్పుడు ఇబోబి తీసుకొస్తానంటున్న ఐఎల్‌పీఎస్ విధానం 1873లో ఆనాటి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిందే. అప్పటికి అవిభక్త అస్సాంగా ఉన్న ఈ ప్రాంతంలోకి వేరే ప్రాంతాలవారు వచ్చి వ్యాపారాలు మొదలుపెడితే భవిష్యత్తులో తమ ప్రయోజనాలు దెబ్బతినవచ్చునని బ్రిటిష్ పాలకులు భావించారు. స్థానిక ఆదివాసీ తెగలను పరిరక్షించే పేరిట ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అరుణాచల్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో దాన్ని అమల్లో ఉంచింది. తగిన పత్రాలు లేకుండా దేశంలోని ఇతర ప్రాంతాలవారు ఈ రాష్ట్రాల్లోకి ప్రవేశించలేరు. ఇదే విధానాన్ని మణిపూర్‌లో కూడా అమలు చేస్తే తమకు ఇతరులనుంచి పోటీ తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మెయితీ తెగ పౌరులు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే కారణంతో మైనారిటీ ఆదివాసీ తెగలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ చట్టం అమలైతే తమకు అంతంత మాత్రంగా ఉన్న అవకాశాలు పూర్తిగా అడుగంటుతాయన్న భయం వారిని ఆవరించింది. అసలు ఆ బిల్లు చట్టంగా మారడం ఎలా అన్న సమస్య ఉండనే ఉంది. రాజ్యాంగంలోని 19(1)(డి) అధికరణ పౌరులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా సంచరించే హక్కునిస్తోంది. దాన్ని సవరించడం, అందుకు అనుగుణంగా చట్టం తీసుకురావడం కేంద్రం చేయాల్సిన పని. కానీ ఆ పని తానే చేస్తానని ప్రకటించి ఆందోళనకారులను ఉపశమింపజేశానని ఇబోబి అనుకుంటున్నారు. వాస్తవానికి 1972లో మణిపూర్ ఒక రాష్ట్రంగా ఏర్పడే వరకూ అవిభక్త అస్సాంలో భాగంగా ఆ ప్రాంతంలో ఐఎల్‌పీఎస్ విధానం అమల్లో ఉండేది. రాష్ట్రం అయ్యాక అది రద్దయింది. ఇప్పుడు ఆందోళనకారులు దాన్నే పునరుద్ధరించమంటున్నారు. అయితే అనేక కారణాలవల్ల కేంద్రం ఆ తరహా సవరణకు సాహసించదు. ఇలాంటి సవరణ తీసుకొస్తే మణిపూర్‌లో అంతర్గతంగా ఏర్పడే సమస్యలకు తోడు ఈశాన్య ప్రాంతం లోని ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమకూ ఆ మాదిరి చట్టం కావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాయి. ఇదంతా కేంద్రానికి పెను సమస్యగా మారుతుంది. నాగాలాండ్‌లో పోరు సాగిస్తున్న ఎన్ఎస్సీఎన్(ఐఎం) సంస్థతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఆశలు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు తయారవుతాయి. సమస్యలకు సమూలమైన పరిష్కారాన్ని ఆలోచించకుండా...గండం గడిచేందుకు తాత్కాలికంగా ఏదో ఒకటి చేద్దామనుకోవడమే ఈశాన్యంలో అసలు సమస్య. ఆ చట్రంనుంచి బయటికొచ్చి అన్ని పక్షాలతో మాట్లాడి, ఆ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తేనే ఈశాన్యంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది.