
మణిపూర్ ఉద్రిక్తతలు
చిన్న నిప్పు రవ్వ కూడా పెను మంటల్ని రగిలించగల ఈశాన్య ప్రాంతంలో ఒక బిల్లు నాలుగు నెలలుగా మణిపూర్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదంటే వింతేమీ లేదు. ఆ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడినట్టు కనిపిస్తున్నా అది తాత్కాలికమేనని చాలామంది అంటున్నారు.
రాష్ట్రానికొచ్చే సందర్శకులు, తాత్కాలికంగా నివసించడానికొచ్చేవారూ, వలసలనూ క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును మార్చి 13న ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. స్థానిక మెయితీ తెగ పౌరుల రక్షణకు ఇది ఏమాత్రం ఉపయోగపడదని, దీనికి బదులు అరుణాచల్, నాగాలాండ్, మిజోరంలో ఉన్నట్టుగా స్థానికేతరుల కదలికలను పూర్తిగా నియంత్రించే ఇన్నర్‌లైన్ పర్మిట్ వ్యవస్థ(ఐఎల్‌పీఎస్) ఉండాలని మెయితీ తెగ డిమాండ్ చేస్తోంది. అందుకు మద్దతుగా కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆందోళన సాగిస్తోంది.
దాంతో క్రమబద్ధీకరణ బిల్లును ఉపసంహరించుకుంటామని, ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నట్టు ఐఎల్‌పీఎస్ బిల్లు తీసుకొస్తామని ఇబోబి ప్రకటించారు. అయినా ఆందోళనలింకా చల్లారలేదు. మరోపక్క ఆ బిల్లు తమ ఉనికిని దెబ్బతీయవచ్చునని మైనారిటీ తెగలు ఆందోళనపడుతున్నాయి. ఇబోబి చెప్పినట్టు వచ్చే నెలకల్లా ఐఎల్‌పీఎస్ బిల్లు సిద్ధమైతే మైనారిటీ తెగలు రోడ్డెక్కడం ఖాయం.
తెగల కుంపటిగా తయారైన మణిపూర్‌లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలికంగా ఏదో ఒక పరిష్కారాన్ని సాధించడం... అక్కడితో తమ పని అయిందన్నట్టు చేతులు దులుపుకోవడం పాలకులకు అలవాటైంది. కనుక మణిపూర్ ప్రశాంతంగా ఉండటం చాలా అరుదు. ఒక ఏడాది కాలంలో అక్కడ జరిగే బంద్‌లు... దేశం మొత్తంలో అదే కాలంలో జరిగే బంద్‌లకన్నా ఎప్పుడూ ఎక్కువే. పైగా ఇవి ఒక రోజుకో, పూటకో పరిమితమై ఉండవు. వారాల తరబడి జరుగుతాయి. అంతకాలమూ రాష్ట్రం స్తంభించిపోతుంది. ఈమధ్యే ఇలాంటి బంద్‌లో చిక్కుకుని ఒక మహిళ కారులోనే ప్రసవించాల్సివచ్చింది.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వరదలొస్తే సహాయ బృందాలు అక్కడికెళ్లడానికి వీలు చిక్కలేదు. ఏ చిన్న సమస్య అయినా రోడ్డెక్కితే తప్ప పరిష్కారం కాదన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా పాతుకుపోవడంవల్లనే బంద్‌లు అక్కడ నిత్యకృత్యమవుతున్నాయి. వీటిని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్ రెండు నెలలక్రితం ప్రకటించారు. నిజంగా ఆయన ఆ పని చేస్తే దానికి నిరసనగా మరో సుదీర్ఘమైన బంద్ ఖాయం.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకో గలిగితే అందరికీ ఉపాధి లభిస్తుంది. వలసలు సైతం తగ్గుతాయి. కానీ ఆ ప్రాంతాన్ని సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన పర్యవసానంగా అక్కడ నిరుద్యోగం రాజ్యమేలుతున్నది. ఒక్క మణిపూర్ సంగతే తీసుకుంటే రాష్ట్ర జనాభా 26 లక్షలుంటే అందులో 30 శాతంమంది నిరుద్యోగులు. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువే. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యుల శాతం 79! అయినా అదేమీ కడుపు నింపడంలేదు. పరిమితంగా ఉండే అవకాశాలను అనేకమందితో పంచుకోవాల్సి రావడంవల్ల పోటీకొచ్చేవారిని శత్రువులుగా జమకట్టే మనస్తత్వం పెరుగుతోంది.
తమ ప్రయోజనాలను ఎక్కడ దెబ్బతీస్తారోనన్న భయంతో అవతలివారిని బెదరగొట్టడం, వారికి అవకాశాల్లేకుండా చేయడం ఎక్కువవుతోంది. ఇదంతా అన్ని తెగల్లోనూ తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నది. పర్యవసానంగానే అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మిలిటెంట్ సంస్థలకు ప్రాణం పోస్తున్నాయి. మణిపూర్‌లో దాదాపు 58 తిరుగుబాటు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ఉద్యమాలు, వసూళ్లు, ఆ క్రమంలో వాటిమధ్య సాగే అంతర్గత పోరు మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి.
ఇప్పుడు ఇబోబి తీసుకొస్తానంటున్న ఐఎల్‌పీఎస్ విధానం 1873లో ఆనాటి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిందే. అప్పటికి అవిభక్త అస్సాంగా ఉన్న ఈ ప్రాంతంలోకి వేరే ప్రాంతాలవారు వచ్చి వ్యాపారాలు మొదలుపెడితే భవిష్యత్తులో తమ ప్రయోజనాలు దెబ్బతినవచ్చునని బ్రిటిష్ పాలకులు భావించారు. స్థానిక ఆదివాసీ తెగలను పరిరక్షించే పేరిట ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అరుణాచల్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో దాన్ని అమల్లో ఉంచింది. తగిన పత్రాలు లేకుండా దేశంలోని ఇతర ప్రాంతాలవారు ఈ రాష్ట్రాల్లోకి ప్రవేశించలేరు.
ఇదే విధానాన్ని మణిపూర్‌లో కూడా అమలు చేస్తే తమకు ఇతరులనుంచి పోటీ తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మెయితీ తెగ పౌరులు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే కారణంతో మైనారిటీ ఆదివాసీ తెగలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ చట్టం అమలైతే తమకు అంతంత మాత్రంగా ఉన్న అవకాశాలు పూర్తిగా అడుగంటుతాయన్న భయం వారిని ఆవరించింది. అసలు ఆ బిల్లు చట్టంగా మారడం ఎలా అన్న సమస్య ఉండనే ఉంది. రాజ్యాంగంలోని 19(1)(డి) అధికరణ పౌరులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా సంచరించే హక్కునిస్తోంది. దాన్ని సవరించడం, అందుకు అనుగుణంగా చట్టం తీసుకురావడం కేంద్రం చేయాల్సిన పని. కానీ ఆ పని తానే చేస్తానని ప్రకటించి ఆందోళనకారులను ఉపశమింపజేశానని ఇబోబి అనుకుంటున్నారు. వాస్తవానికి 1972లో మణిపూర్ ఒక రాష్ట్రంగా ఏర్పడే వరకూ అవిభక్త అస్సాంలో భాగంగా ఆ ప్రాంతంలో ఐఎల్‌పీఎస్ విధానం అమల్లో ఉండేది. రాష్ట్రం అయ్యాక అది రద్దయింది.
ఇప్పుడు ఆందోళనకారులు దాన్నే పునరుద్ధరించమంటున్నారు. అయితే అనేక కారణాలవల్ల కేంద్రం ఆ తరహా సవరణకు సాహసించదు. ఇలాంటి సవరణ తీసుకొస్తే మణిపూర్‌లో అంతర్గతంగా ఏర్పడే సమస్యలకు తోడు ఈశాన్య ప్రాంతం లోని ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమకూ ఆ మాదిరి చట్టం కావాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాయి. ఇదంతా కేంద్రానికి పెను సమస్యగా మారుతుంది. నాగాలాండ్‌లో పోరు సాగిస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) సంస్థతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై ఆశలు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి కొత్త సమస్యలు తయారవుతాయి. సమస్యలకు సమూలమైన పరిష్కారాన్ని ఆలోచించకుండా...గండం గడిచేందుకు తాత్కాలికంగా ఏదో ఒకటి చేద్దామనుకోవడమే ఈశాన్యంలో అసలు సమస్య. ఆ చట్రంనుంచి బయటికొచ్చి అన్ని పక్షాలతో మాట్లాడి, ఆ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తేనే ఈశాన్యంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది.