- నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష వాయిదాతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు, నిరుద్యోగులు అసెంబ్లీకి చేరుకోకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడమే కాక లాఠీలకు సైతం పనిచెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా అసెంబ్లీ వరకు చేపట్టిన ర్యాలీని కళాశాల దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన నిరుద్యోగులు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.
జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు భీంరావునాయక్, బండి నరేశ్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో రవి అనే ఓ టీవీ చానల్ కరస్పాండెంట్‌కి గాయాలయ్యాయి. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ లక్ష ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచి పరీక్ష వాయిదా వేయాలని, ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చే యాలని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గ్రంథాలయానికి తాళం..
చలో అసెంబ్లీ నేపథ్యంలో అశోక్ నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని ఉదయం 6 గంటలకే పోలీసులు మూసేశారు. గ్రంథాలయం ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తారని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా తాళాలు వేశారు. గ్రంథాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో నిరుద్యోగులు.. పోలీసుల కళ్లుగప్పి ఒక్కొక్కరుగా అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దపెట్టున నినదిస్తూ అసెంబ్లీ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతోపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో మరో 12 మంది గ్రూప్స్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరుద్యోగుల అణచివేత దారుణం..: ఆర్.కృష్ణయ్య
నిరుద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే ప్రభుత్వం పోలీసులతో అణచివేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. నిరుద్యోగులు అరెస్టయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నవారిపై నిరంకుశంగా ప్రవర్తిం చడం ఏమిటని ప్ర శ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో నిరుద్యోగు లు ఉండగా.. కేవలం 439 గ్రూప్-2 పో స్టులను భర్తీ చేస్తామనడం సరికాదన్నారు.
చలో అసెంబ్లీ ఉద్రిక్తం
Published Sat, Mar 19 2016 2:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement