మళ్లీ జాట్ల లొల్లి: హరియాణాలో ఉద్రిక్తత
చండీగఢ్: ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లను అమలుచేయడంతోపాటు, కోటా శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ హరియాణాలోని జాట్ కులస్తులు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఆదివారం నుంచి 15 రోజుల పాటు నిరవధిక ఆందోళనలను నిర్వహించాలన్న ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి(ఏఐజేఏఎస్ఎస్) పిలుపు మేరకు వేల మంది జాట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు నేటి నుంచి జరగనున్న ఉద్యమం విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆందోళన కారులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు అధికారులు ప్రణాలికలు రచించారు. ఇందుకోసం 55 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపడమేకాక చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న జాజ్జర్, సోనిపట్, రోహ్ తక్, పానిపట్, హిసార్, ఫతేహాబాద్, జింద్, ఖైతాల్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. ఈ పరస్థితుల నడుమ హరియాణాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తమను ఓబీసీ కేటగిరీలో చేర్చాలంటూ ఫిబ్రవరిలో జాట్లు నిర్వహించిన ఆందోళనలు హింసాయుతంగా మారడం, అల్లర్లలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి ఉద్యమం ఫలితంగా జాట్లకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు లభించాయి. అయితే ఆ ఉత్తర్వులపై పంజాబ్ హైకోర్టు స్టే ఇవ్వడంతో జాట్లు మళ్లీ ఆందోళనబాట పట్టారు. ప్రకటించిన రిజ్వేషన్లను వెంటనే అమలుచేయాలనడమేకాక రిజర్వేషన్ శాతాన్ని పెంచాలనే కొత్త డిమాండ్ తో జాట్లు ఆందోళన చేపట్టారు.