ప్రాణాలు తీయని ఆయుధాలున్నాయా !
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో రాళ్లు రువ్వే మూకలను నియంత్రించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా కళ్లు పోవడమే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నందున ప్రాణాంతకంకానీ, హాని కలిగించని ప్రత్యామ్నాయ ఆయుధాలను ఉపయోగించాలని కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ఓ ఉన్నత స్థాయి కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అలాంటి ప్రత్యామ్నాయ ఆయుధాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచంలోని వివిధ దేశాలు ఆందోళనలను నియంత్రించేందుకు లేదా అదుపు చేసేందుకు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. కశ్మీర్‌లో మన భద్రతా దళాలు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్స్ వల్ల వందలాది మంది ఆందోళనకారులకు శాశ్వతంగా కళ్లుపోవడం, ఏటీఎం వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు 21 ఏళ్ల రియాజ్ అహ్మద్ షా లాంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మనకు తెల్సిందే. పెల్లెట్ గన్స్ ఒక్క భారత దేశం మాత్రమే ఉపయోగించడం లేదు. మనలాగే మరికొన్ని దేశాలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఈజిప్టు పోలీసులు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించడం వల్ల 31 ఏళ్ల షైమా ఎల్ షబాగ్ అనే అమాయక వ్యక్తి మరణించారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారికి ఈజిప్టు ప్రభుత్వం 2015లో 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్ రబ్బర్ కోటెడ్ పెల్లెట్స్‌ను ప్రయోగించడం వల్ల 12 మంది అరబ్-ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. దీనిపై వేసిన దర్యాప్తు కమిషన్ సిఫార్సు మేరకు ఇజ్రాయెల్ ఈ పెల్లెట్స్ ప్రయోగాన్ని నిషేధించింది.
భారత హోం శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా పెల్లెట్ల ప్రయోగాన్ని నిషేధించి, వాటి స్థానంలో ‘పెలార్గానిక్ ఆసిడ్ వానిల్లి అమైడ్ షెల్స్’ను ఉపయోగించాలని సిఫార్సు చేసినట్లు తెల్సింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మిర్యాల పొడికి ఘాటైన రూపం లేదా సాంద్రీకరించిన మిర్యాల పొడి. 1980లోనే దీన్ని అమెరికా అభివద్ధి చేసింది. మొదట దీన్ని క్రూరమైన ఖడ్గ మగాలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయోగించేవారు. ఆ తర్వాత క్రౌడ్ కంట్రోల్‌కు కూడా ఉపయోగిస్తూ వచ్చారు. దీని వల్ల కూడా కళ్లకు, ఊపిరితిత్తులకు, గుండెకు హాని కలుగుతుంది.
కండోర్ రబ్బర్ బుల్లెట్లను కూడా ప్రత్యామ్నాయ ఆయుధంగా వాడొచ్చని భారత కమిటీ సూచించినట్లు తెల్సింది. 1970లో పెల్లెట్లకంటె పెద్దవైన ఈ రబ్బర్ బుల్లెట్లను బ్రిటన్ అభివద్ధి చేసింది. ఉత్తర ఐర్లాండ్‌లో ఆందోళనలను అరికట్టేందుకు బ్రిటన్ బలగాలు వీటిని ఉపయోగించేవి. వీటిని ఆందోళనకారుల కాళ్ల ముందు ప్రయోగించినట్లయితే నేల మీద తగిలి వారి కాళ్లకు తగులుతాయి. కాళ్లపై తాత్కాలిక గాయాలవుతాయి. కానీ నేరుగా కాళ్లపై ప్రయోగించినట్లయితే కాళ్ల ఎముకలు విరిగిపోయి శాశ్వత అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. తగలరాని చోట తగిలితే ప్రాణాలు కూడా పోతాయి. దాంతో ఈ రబ్బర్ బుల్లెట్ల వాడకాన్ని 1975లో బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇప్పటికీ కొన్ని దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. 2015లో నేపాల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణచివేయడానికి అక్కడి భద్రతా బలగాలు ఈ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించడం వల్ల ఓ బాలుడు సహా నలుగురు వ్యక్తులు మరణించారు.
అమెరికాలో కూడా వీటిని ప్రయోగించడం వల్ల పౌరులకు తీవ్ర గాయాలైన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఆందోళనలను అరికట్టేందుకు ‘స్టన్ గ్రెనేడ్స్’ను ఉపయోగిస్తున్నారు. కనుక మరో ప్రత్యామ్నాయంగా ఈ అంశాన్ని కూడా పరిశీలించాలని భారత కమిటీ సూచించింది. వీటిని జనం మధ్యకు ప్రయోగించినప్పుడు భారీ శబ్దంతో పేలుతాయి. తాత్కాలికంగా ఆందోళనకారులకు కళ్లు కనిపించకుండా, చెవులు వినిపించకుండా పోతాయి. వీటివల్ల చెవుల్లోని కర్ణభేరీలు శాశ్వతంగా దెబ్బతినడమే కాకుండా, ఊపిరితిత్తుల్లోని మదువైన పొరల కూడా శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ప్రాణాంతకంకానీ, పౌరులకు హాని చేయని ఆయుధం ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. టియర్ గ్యాసెస్‌ను గుడ్డిగా ప్రయోగించినా ప్రమాదం లేకపోలేదు.
మరి, ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు మార్గమేది? అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఓ అంశం మీద ఆందోళన చేయడం పౌరుల ప్రజాస్వామ్య హక్కుని ప్రభుత్వాలు గుర్తించి వారి ఆందోళనలకు కారణమవుతున్న అంశాలను పరిష్కరించడమే అన్నింటికన్నా ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఆయుధాన్ని ప్రయోగించాల్సి వచ్చినప్పుడు అది ఏ ఆయుధం ఉపయోగిస్తున్నారన్న దానికన్నా ఆ ఆయుధాన్ని ఎంత బాధ్యాతాయుతంగా ఉపయోగిస్తున్నారన్నది ముఖ్యం. అందుకు అమాయకులు బాధితులవుతే అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయడం అంతకన్నా ముఖ్యం. ఈజిప్టులో లాగా అందుకు బాధ్యులైన అధికారులను శిక్షిస్తే వారిలో బాధ్యత పెరుగుతుంది.