మృతుల్లో ఒక కెప్టెన్ కూడా
రక్షణ మంత్రి, ఆర్మీ సంతాపం
ముష్కరుల కోసం భారీ వేట
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్‌కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కథువా జిల్లా మారుమూల మఛేడీ అటవీప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి ఐదుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. దోడాలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య గత మూడు వారాల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్. ఇది తమ పనేనని పాక్ దన్నుతో చెలరేగిపోతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది.
ఉగ్రవాదులు నక్కారన్న నిఘా సమాచారంతో రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దేసా అటవీ ప్రాంత పరిధిలోని ధారీ గోటే ఉరర్‌బాగీ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 20 నిమిషాల ఎదురుకాల్పుల అనంతరం ఉగ్రవాదులు వెన్నుచూపారు. ప్రతికూల అటవీ ప్రాంతంలోనూ కెపె్టన్ సారథ్యంలో బలగాలు వారిని వెంటాడాయి. దాంతో సోమవారం రాత్రి 9 గంటల అనంతరం మరోసారి చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కెపె్టన్‌తో పాటు మరో ముగ్గురు అసువులు బాశారని అధికారులు తెలిపారు. ఈ ముష్కరులు అక్రమంగా సరిహద్దు దాటి చొచ్చుకొచ్చి రెండు నెలలుగా అటవీ ప్రాంతంలో నక్కినట్టు భావిస్తున్నారు. వారికోసం అదనపు బలగాలతో సైన్యం, పోలీసులు భారీగా గాలిస్తున్నారు. ఎలైట్ పారా కమెండోలను కూడా రంగంలోకి దించారు.
బాధగా ఉంది: రాజ్‌నాథ్
ముష్కరులను ఏరేసే క్రమంలో నలుగురు వీర జవాన్లు అమరులు కావడం చాలా బాధగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సైనిక ఉన్నతాధికారులు వారికి ఘనంగా నివాళులరి్పంచారు. కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
నా కొడుకు త్యాగానికి గర్విస్తున్నా..
దేశ రక్షణలో అమరుడైన కొడుకును చూస్తే గర్వంగా ఉందని కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లిదండ్రులు కల్నల్ (రిటైర్డ్) భువనేశ్ కె.థాపా, నీలిమ అన్నారు. ‘‘నా కుమారుడు చిన్నతనం నుంచీ నన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. సైన్యంలో చేరాలని ఉవి్వళ్లూరేవాడు. 27 ఏళ్ల వయసులో కల నెరవేర్చుకున్నాడు. రెండు రోజుల క్రితమే నాతో ఫోన్లో మాట్లాడాడు. నిత్యం ప్రాణాపాయం పొంచి ఉండే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో నా కుమారుడు అమరుడైనందుకు గర్విస్తున్నా’’ అని భువనేశ్ చెప్పారు.
ఆర్మీ డే రోజు పుట్టాడు
కెపె్టన్ థాపా ఆర్మీ డే అయిన జనవరి 15న జని్మంచారని తల్లి తెలిపారు. తనకింకా పెళ్లి కూడా కాలేదని సుళ్లు తిరుగుతున్న బాధను అణచుకుంటూ చెప్పారామె. కుటుంబంలో ఆయన వరుసగా మూడో తరం సైనికుడు! థాపా తండ్రితో పాటు తాత కూడా సైన్యంలో సేవ చేశారు. ఆయన ఇంజనీరింగ్ చేసి కూడా పట్టుబట్టి ఆరీ్మలోనే చేరారు. 145, ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌కు చెందిన థాపా రాష్రీ్టయ రైఫిల్స్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.
బీజేపీ తప్పుడు విధానాల వల్లే... జవాన్ల మృతిపై రాహుల్ నిప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో 78 రోజుల్లో 11 ఉగ్రదాడులు జరిగినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. బీజేపీ తప్పుడు విధానాల ఫలితాన్ని వీర సైనికులు, వారి కుటుంబాలు అనుభవించాల్సి వస్తోందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 11 ఉగ్రదాడుల్లో 13 మంది ఆర్మీ, పోలీసు సిబ్బంది అమరులయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ దాడులను, సైనికుల బలిదానాలను ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆరి్టకల్ 370 రద్దుతో ఉగ్రవాదాన్ని నాశనం చేశామనే బూటకపు వాదనకు సైనికులు తమ ప్రాణాలతో మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
ఆ అమర సైనికునిది ఏపీ
సంతబోమ్మాళి: దోడాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన డొక్కరి రాజేశ్ (25)ది ఆంధ్రప్రదేశ్. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబోమ్మాళి మండలం చెట్లతాండ్ర. రాజేశ్ ఐదేళ్ల కింద ఆర్మీలో చేరారు. వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు చిట్టివాడు, పార్వతి కేవలం ఎకరం పొలం సాగు చేస్తూ రాజేశ్‌ను, ఆయన సోదరున్ని చదివించారు. సోదరుడు మధుసూదనరావు డిగ్రీ పూర్తి చేశాడు. రాజేశ్ మృతితో తల్లిదండ్రులు కంటికో ధారగా విలపిస్తున్నారు. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ఏడాదే 12 మంది సైనికుల మృతి
2024లో జమ్మూలో ఉగ్ర దాడులు...
ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ప్రభుత్వోద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతోఎదురు కాల్పుల్లో విలేజీ రక్షక దళ సభ్యుని మృతి.
మే 4: పూంచ్ జిల్లాలో ఉగ్ర దాడిలో ఐఏఎఫ్ సిబ్బంది మరణించగా ఐదుగురు గాయపడ్డారు.
జూన్ 9: రీసీ జిల్లాలో ఉగ్ర దాడిలో 9 మంది భక్తులు మరణించగా 42 మంది గాయపడ్డారు.
జూన్ 11, 12: కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్లో ఇద్దరు విదేశీ ముష్కరులు హతమవగా ఒక సీఆరీ్పఎఫ్ జవాను అమరుడయ్యాడు.
జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్ర దాడిలో ఓ పోలీసుకు గాయాలు.
జూన్ 26: దోడా జిల్లాలో ముగ్గురు విదేశీ ముష్కరుల కాలి్చవేత.
జూలై 7: రాజౌరీ జిల్లాలో ఉగ్ర దాడిలో సైనిక సిబ్బంది గాయపడ్డారు.
జూలై 8: కథువా జిల్లాలో ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కి ఐదుగురు సైనికులు బలయ్యారు.
జూలై 15: దోడా ఎన్‌కౌంటర్‌లో కెప్టెన్‌తో పాటు మరో ముగ్గురు సైనికుల వీరమరణం.
Comments
Please login to add a commentAdd a comment