
సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి...
కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు చెందిన సంస్థ ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది.
న్యూఢిల్లీ: కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఓ సంస్థ ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది. భారతీయ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిపై పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వారు నిరసిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ నేతలు, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఐశ్వర్యారాయ్, సోనియా గాంధీ, జుకర్ బర్గ్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్ తదితర ప్రముఖుల ఫోటోలతో పెల్లెట్ గన్ ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పోస్టులలో రాశారు. ఫోటోలలో పెల్లెట్ గన్ ల కారణంగా సెలబ్రిటీల ముఖానికి, కళ్లకు గాయాలైనట్లు మార్ఫింగ్ చేశారు.
కశ్మీర్ కల్లోలంపై పాకిస్తాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఫోటోలు ఆన్ లైన్ లో విడుదలవ్వడం గమనార్హం. కాగా, పాక్ వ్యాఖ్యాలపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ ప్రజలల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా పాక్ వ్యాఖ్యలను చేయకూడదని సూచించారు. కశ్మీర్ లో రెండ్రోజుల పర్యటన ముగించుకున్న రాజ్ నాథ్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. పోలీసు బలగాలపై కశ్మీర్ యువత రాళ్లు విసరొద్దని, యువకులపై తొందరపడి పెల్లెట్ గన్ లు ఉపయోగించొద్దని భధ్రతా దళాలను ఆయన కోరారు. ఈనెల 8న టెర్రరిస్టు బుర్హాన్ వానీ కాల్చివేత అనంతరం రాజుకున్న కశ్మీర్ కల్లోలంలో ఇప్పటివరకు 45మంది మరణించారు.