
'పాకిస్థాన్ జిందాబాద్' గొంతుకలతో చర్చలా?
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, పాకిస్థాన్ కు వత్తాసుపలుకుతూ, తాము పాకిస్థానీయులమేనని చెప్పుకుంటున్నవారిపై జమ్ముకశ్మీర్ ఇస్లాం మతబోధకులు మండిపడ్డారు. కశ్మీర్ మతబోధకుల బృందం మంగళవారం ఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి, పాకిస్థాన్ కు జిందాబాద్ కొడుతున్న వేర్పాటువాదులతో చర్చలు జరపొద్దని డిమాండ్ చేసింది.
శని, ఆదివారాల్లో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్ష బృందంలోని కొందరు సభ్యులు వేర్పాటువాదులతో సమావేశం కావడాన్ని ముస్లిం మతపెద్దలు తప్పుపట్టారు. కశ్మీర్ సమస్య పరిష్కరించే క్రమంలో అలాంటి వారితో చర్చలు అనవరసమని వారు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజ్ నాథ్ ముందు వెల్లడించారు. వేర్పాటువాదుల తీరు తనను కూడా అసంతృప్తికి గురిచేసిందని హోం మంత్రి అన్నారు.
రాజ్ నాథ్ నేతృత్వంలో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్షబృందంలో సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన ఎంపీలు డి. రాజా, శరద్ యాదవ్, జయప్రకాశ్ నారాయణ్ లు మరో ప్రత్యేక బృందంగా ఏర్పడి వేర్పాటువాద నేతలతో చర్చలు జరిపేందుకు ఆదివారం విఫలయత్నం చేశారు. గృహనిర్భంధంలో ఉన్న హురియత్ కీలక నేత సయీద్ అలీషా గిలానీ.. తాను ఎంపీల బృందంతో మాట్లాడబోనని తేగేసి చెప్పారు. మరో నేత అబ్దుల్ ఘనీ భట్ అఖిలపక్షం పర్యటనను పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రస్తుతం పోలీస్ నిర్బంధంలో ఉన్న యాసిన్.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మాట్లాడలేనని, ఢిల్లీకి వచ్చినప్పుడు కలుస్తానని ఎంపీలతో అన్నారు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ 'కశ్మీరియత్, ఇన్సానియత్, జమూరియత్' విధానానికి వ్యతిరేకంగా వేర్పాటువాద నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేరీతిలో ఇప్పుడు కశ్మీరీ మతపెద్దలు కూడా వేర్పాటువాద నేతలతో ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు.
మరోవైపు కశ్మీర్ ఆందోళనలను అదుపుచేసే క్రమంలో వేర్పాటువాద నేతలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయా నేతలకు కల్పిస్తోన్న భద్రతను ఉపసంహరణ లేదా తగ్గించాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేర్పాటువాద నేతల విదేశీయానాలు, ఇతర పర్యటనలు, సమావేశాలనూ నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాగా, కశ్మీర్ లో పర్యటించిన అఖిలిపక్ష బృందం బుధవారం ఢిల్లీలో మరోసారి భేటీ కానున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ చెప్పారు.