Kashmir unrest
-
‘ఆ నివేదికను పార్లమెంట్లో పెట్టాలి’
శ్రీనగర్ : కశ్మీర్ చర్చలపై కేంద్రం నియమించిన ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ చర్చలపై కేంద్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక పార్లమెంట్లో వెలుగుచూస్తేనే ఆయన విజయం సాధించినట్లని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ‘కశ్మీర్ చర్చలకు సంబంధించి దినేశ్వర్ శర్మను ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంలో కేంద్రం ఆంతర్యమేమిటో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంది. చర్చలు మొదలు కాకముందే ఆయన పాత్రను నామమాత్రం చేసేందుకు ప్రభుత్వమే వివిధ రకాల వాదనలను లేవనెత్తుతోంది. కశ్మీర్‌పై నేనెప్పుడూ చర్చలకు సిద్ధమే..అయితే చర్చలపై నాకున్న అభ్యంతరమల్లా కేంద్రం అనుసరిస్తోన్న అస్పష్ట వైఖరితోనే. కశ్మీర్‌పై శర్మకున్న స్పష్టత ఏమిటో ఎవరికీ అంతు చిక్కడంలేదు. కశ్మీర్‌పై ఆయన ఏ అజెండాతో ముందుకెళ్తారన్నది ఇప్పటికీ తెలియడం లేదు. 2010లో యూపీఏ ప్రభు త్వం కశ్మీర్ అంశాన్ని తేల్చేందుకు దిలీప్ పద్గోవంకర్, రాధా కుమార్, ఎమ్.ఎమ్ అన్సారీలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తే సరైనదంటూ ఈ త్రిసభ్య కమిటీ 2012లో కేంద్రానికి నివేదికను సమర్పిచింది. అయితే, ఈ కమిటీ నివేదిక ఇప్పటివరకూ వెలుగుచూడలేదు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. -
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే.!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సదస్సు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ దారిలోనే సాగుతూ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ కూడా సార్క్ సదస్సును బహిష్కరించాయి. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ దాడి నేపథ్యంలో పాక్‌ను ఎంతమాత్రం ఉపేంక్షించరాదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు వీలున్న అన్నీ మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధు నది ఒప్పందంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పాక్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. తాజాగా సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ప్రాంతీయంగా ఆధిపత్యం సాధించింది. ఈ నిర్ణయం ద్వారా భారత్ దక్కిన సానుకూలతలు ఏమిటంటే.. ప్రాంతీయ సహకారంలోనూ ఉగ్రవాద కోణాన్ని జోడించడం! 'ప్రాంతీయ సహకారం, అనుసంధానత, సంప్రదింపుల విషయంలో భారత్ కట్టుబడి ఉంది. కానీ, ఇది ఉగ్రవాద రహిత వాతావరణంలోనే ముందుకు సాగుతుందని భావిస్తోంది'.. పాక్‌లో 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ద్వారా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాదు.. దక్షిణాసియా ప్రాంతీయ సహకారానికి పెను ముప్పుగా మారిందనే విషయాన్ని మన దేశం తేల్చిచెప్పింది. ఒకప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల సందర్భంలోనే ఉగ్రవాద రహిత వాతావరణం ప్రస్తావన వచ్చేది. కానీ ఇప్పుడు ప్రాంతీయ చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన అంశంగా భారత్ ముందుకు తెచ్చింది. పాక్‌ను ఇరుకునపెట్టడంలో భారత్‌కు కొత్త మిత్రులు! పాక్‌ను ప్రాంతీయంగా ఇరుకున పెట్టడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించింది. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారా? లేదా? అన్నది సందేహాస్పదంగా ఉండగానే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ముందుకొచ్చి.. తాము ఆ దేశానికి వెళ్లబోమని తేల్చిచెప్పాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా చెప్పడంతో బంగ్లా, ఆఫ్గన్‌తో మన పొరుగు దేశం భూటాన్ కూడా జతకలిసి.. పాక్‌కు షాకిచ్చింది. సార్క్ పునరుద్ధరణ! 1985లో దక్షిణాసియాలోని ఎనిమిది సభ్యదేశాలతో ఏర్పాటైన సార్క్‌తో విస్తృత సంబంధాలు కొనసాగించేందుకు ఎన్డీయే సర్కారు తపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం అడ్డుపుల్ల వేస్తోంది. సార్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కొర్రిలు పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మినహాయించి ఇతర సార్క్ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, పాక్‌ను బ్లాక్ చేసేలా సబ్-రిజినల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కీలకమే! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ పాకిస్థాన్‌ను నియంత్రించడం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలపై నిలబడాల్సిన పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వానిది. అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పాక్‌పై కఠినంగా వ్యవహరించక తప్పదు. ఆ సంకేతాలు ఇచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇక పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న విధానం కూడా అమలవుతున్నదన్న సంకేతాలను సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా భారత్ ఇచ్చినట్టు అయింది. దీనికితోడు బంగ్లా, ఆఫ్గన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నివారించి ఆ దేశాలను తనవైపు తిప్పుకోవడంలోనూ అడ్వాంటేజ్ సాధించింది. నిజానికి దక్షిణాసియాలో మిత్రదేశాలు కావాలని పాక్ కోరుకోవడం లేదు. చైనా, అమెరికా, సౌదీ అరేబియలతో దౌత్య సంబంధాలకే ఆ దేశం అధిక ప్రాధాన్యమిస్తోంది. అయినా సార్క్ సదస్సును నిర్వహించే అవకాశాన్ని పాక్ కోల్పోవడం నిజంగా ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉరీ ఉగ్రదాడి ఎందుకు జరిగిందంటే..
-
ఉరీ ఉగ్రదాడి ఎందుకు జరిగిందంటే..
లండన్: కశ్మీర్ లోని ఉరీ సైనిక స్థావరంపై దాడిచేసి 18 మంది జవాన్లను చంపిన ఉగ్రవాదులు పాకిస్థానీలే అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పలు ఆధారాలు సేకరించింది. ఆ మేరకు ఉరీ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలు, వేలిముద్రలు, దాడికి ఉపయోగించిన ఆయుధాలు, ఆహార పదార్థాలు ఇతరత్రా వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు సమర్పించింది. ఆ వివరాలను ఇస్లామాబాద్ కు చేరవేసిన ఆయన తమ ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోపే అసలు ఉరీ దాడి ఎందుకు జరిగిందో తనదైన శైలిలో భాష్యం చెప్పారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని నేరుగా లండన్ వెళ్లిన నవాజ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండు నెలలుగా కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్తతలకు కొనసాగింపుగానే ఉరీ ఉగ్రదాడి జరిగిఉండొచ్చని అన్నారు. 'భారత సైన్యం అణిచివేతతో ఎంతో మంది కశ్మీరీలు తమ ఆప్తులను కోల్పోయారు. లెక్కకుమించి యువకులు కళ్లు పోగొట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగానే ఉరీలో దాడి జరిగింది. ఎప్పటిలాగే భారత్.. పాకిస్థాన్ వైపే వేలెత్తిచూపుతోంది. సరైన ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ను నిందించడం ఆ (భారత్)దేశానికున్న చారిత్రక అలవాటు. ఉరీలో చనిపోయిన నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో తయారైన గ్రెనేడ్లు, ఆహారం వినియోగించారని ఆరోపిస్తున్నారు. కానీ రెండు నెలల కిందట బుర్హాన్ వని చనిపోయినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఎనసాగటంలేదని గుర్తుంచుకోవాలి' అని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఉరీలో దాడికి పాల్పడింది ముమ్మాటికీ పాకిస్థానీలేనని అందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ పాక్ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ చెప్పారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టిన కొద్ది గంటలకే వారి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, ఇతరత్రా ఆధారాలను ఢిల్లీలోని పాక్ కమిషనర్ కు అందించారు. పఠాన్ కోట్ సహా ఇతర దాడుల్లోనూ పాక్ హస్తం ఉందనే ఆధారాలు సైతం సమర్పించారు. వీటిపై ఇస్లామాబాద్ అధికారికంగా స్పందించాల్సిఉంది. ఈలోపే నవాజ్ షరీఫ్ భాష్యం చెప్పడంతో ఉరీదాడిపై పాక్ అభిప్రాయం వెల్లడైనట్లైంది. -
'పాకిస్థాన్ జిందాబాద్' గొంతుకలతో చర్చలా?
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, పాకిస్థాన్ కు వత్తాసుపలుకుతూ, తాము పాకిస్థానీయులమేనని చెప్పుకుంటున్నవారిపై జమ్ముకశ్మీర్ ఇస్లాం మతబోధకులు మండిపడ్డారు. కశ్మీర్ మతబోధకుల బృందం మంగళవారం ఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి, పాకిస్థాన్ కు జిందాబాద్ కొడుతున్న వేర్పాటువాదులతో చర్చలు జరపొద్దని డిమాండ్ చేసింది. శని, ఆదివారాల్లో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్ష బృందంలోని కొందరు సభ్యులు వేర్పాటువాదులతో సమావేశం కావడాన్ని ముస్లిం మతపెద్దలు తప్పుపట్టారు. కశ్మీర్ సమస్య పరిష్కరించే క్రమంలో అలాంటి వారితో చర్చలు అనవరసమని వారు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజ్ నాథ్ ముందు వెల్లడించారు. వేర్పాటువాదుల తీరు తనను కూడా అసంతృప్తికి గురిచేసిందని హోం మంత్రి అన్నారు. రాజ్ నాథ్ నేతృత్వంలో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్షబృందంలో సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన ఎంపీలు డి. రాజా, శరద్ యాదవ్, జయప్రకాశ్ నారాయణ్ లు మరో ప్రత్యేక బృందంగా ఏర్పడి వేర్పాటువాద నేతలతో చర్చలు జరిపేందుకు ఆదివారం విఫలయత్నం చేశారు. గృహనిర్భంధంలో ఉన్న హురియత్ కీలక నేత సయీద్ అలీషా గిలానీ.. తాను ఎంపీల బృందంతో మాట్లాడబోనని తేగేసి చెప్పారు. మరో నేత అబ్దుల్ ఘనీ భట్ అఖిలపక్షం పర్యటనను పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రస్తుతం పోలీస్ నిర్బంధంలో ఉన్న యాసిన్.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మాట్లాడలేనని, ఢిల్లీకి వచ్చినప్పుడు కలుస్తానని ఎంపీలతో అన్నారు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ 'కశ్మీరియత్, ఇన్సానియత్, జమూరియత్' విధానానికి వ్యతిరేకంగా వేర్పాటువాద నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేరీతిలో ఇప్పుడు కశ్మీరీ మతపెద్దలు కూడా వేర్పాటువాద నేతలతో ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు కశ్మీర్ ఆందోళనలను అదుపుచేసే క్రమంలో వేర్పాటువాద నేతలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయా నేతలకు కల్పిస్తోన్న భద్రతను ఉపసంహరణ లేదా తగ్గించాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేర్పాటువాద నేతల విదేశీయానాలు, ఇతర పర్యటనలు, సమావేశాలనూ నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాగా, కశ్మీర్ లో పర్యటించిన అఖిలిపక్ష బృందం బుధవారం ఢిల్లీలో మరోసారి భేటీ కానున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ చెప్పారు. -
డాక్టర్ కావాలనుకుంది కానీ..
14 ఏళ్ల ఈషా డాక్టర్ కావాలనుకుంది. కానీ తానే పేషంట్‌గా మారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమెను ఆదివారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. కశ్మీర్‌లోయలో జరుగుతున్న అల్లర్లలో స్థానిక బాలిక అయిన ఈషా పెల్లెట్ల కారణంగా తీవ్రంగా గాయపడింది. దీంతో మెరుగైన చికిత్స అందించేందుకు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆమెను పరామర్శించిన అనంతరం సీఎం మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ డాక్టర్ కావాలని కలలు కన్న ఈషా ఇప్పుడు ఆస్పత్రిలో బాధితురాలిగా ఉండటం బాధ కలిగిస్తున్నదని తెలిపారు. 'నేను ప్రభుత్వంలోకి వచ్చి మూడు నెలలే. ఓ ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి పరిస్థితి నెలకొనడంలో నేను చేసిన తప్పు ఏముంది?' అని ఆమె అన్నారు. కశ్మీర్లో హింసను వ్యతిరేకిస్తూ.. శాంతిని పునరుద్ధరించడంలో సహకరించే వారందరితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ముఫ్తీ తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలకు ప్రభుత్వం వ్యతిరేకంగా లేదనే సంకేతాలు ఇచ్చారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్ లోయలో గత 51 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 70మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. -
'నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి.. ప్లీజ్'
'వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాపట్ల ఆగ్రహంగా ఉండొచ్చు. మీ పట్ల నాకు కోపం ఉండొచ్చు. కానీ దయచేసి నాకొక అవకాశాన్ని ఇవ్వండి'.. ఇది జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆందోళనకారులకు చేసిన విజ్ఞప్తి. గత 49 రోజులుగా కశ్మీర్లో అశాంతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని నివాసమైన 7రేస్‌కోర్సు రోడ్డు రెసిడెన్సీలో జరిగిన వీరి భేటీలో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ప్రధానితో భేటీ అనంతరం సీఎం మెహబూబా మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో హింసకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. 'మనందరిలాగే ప్రధాని మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు' అని తెలిపారు. లోక్‌సభలో మోదీకి మూడింట రెండొంతుల సంఖ్యాబలం ఉందని, ఆయన వల్ల కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించకుంటే, మరెవరి వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించబోదని దివంగత సీఎం, తన తండ్రి ముఫ్తి మహమ్మద్ సయ్యద్ ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తుచేశారు. కశ్మీర్‌లోయలో హింసకు పాకిస్థానే కారణమని ఆమె ధ్వజమెత్తారు. 'కశ్మీర్ యువత పట్ల పాకిస్థాన్‌కు ఏమాత్రం కనికరమున్నా.. సెక్యూరిటీ క్యాంప్స్, పోలీసు స్టేషన్లపై దాడిచేసేలా వారిని రెచ్చగొట్టడం మానుకోవాలి' అని ఆమె సూచించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ ఇప్పటికే పాకిస్థాన్ సందర్శించారని, కానీ పాక్ నేతలు ఎందుకు ప్రతిస్పందించడం లేదని ఆమె నిలదీశారు. కశ్మీర్ వేర్పాటువాద నేతలు కూడా లోయలో శాంతి నెలకొనేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జూలై 8న భద్రతా దళాల ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోవడంతో కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
చర్చల దిశగా ‘కశ్మీర్’
గత 46 రోజులుగా అల్లకల్లోలంగా ఉన్న కశ్మీర్ విషయంలో మంగళవారం జరిగిన పరిణామాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఆ సమస్యపై రాజ్యాంగానికి లోబడి చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా, రాజకీయ పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. గత నెల 8న హిజ్బుల్ సంస్థ కమాండర్ బర్హాన్ వానీని భద్రతా బలగాలు మట్టుపెట్టింది మొదలుకొని ఈరోజు వరకూ కశ్మీర్ మండుతూనే ఉంది. కర్ఫ్యూ, బాష్పవాయు గోళాల ప్రయోగం, కాల్పులు నిత్యకృత్యమయ్యాయి. వివిధ ఘటనల్లో మరణిం చినవారి సంఖ్య 69కి చేరుకుంది. వందలమంది గాయపడ్డారు. పెల్లెట్లు ప్రయోగిం చిన కారణంగా అనేకులు కంటిచూపు కోల్పోయారు. ఇంత జరిగాక తొలిసారిగా మంగళవారం పగటిపూట కర్ఫ్యూను సడలించారు. వాస్తవానికి ఈ నెల 13న న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగినప్పుడు చర్చల విషయమై ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని అందరూ ఆశించారు. ఆ భేటీలో పాల్గొన్న రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వానికి అదేవిధంగా విజ్ఞప్తి చేశాయి. కానీ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దేశంలో విలీనం చేయడం ఇప్పుడు మిగిలిన ఎజెండా అన్నారు. అక్కడా, బలూచిస్తాన్‌లోనూ పాక్ సైన్యం సాగిస్తున్న హింసాకాండను ప్రస్తావించారు. కశ్మీర్లో.. మరీ ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో ఇప్పుడు నెలకొన్న స్థితి అసాధారణమైనది. ఇంతక్రితం 2008, 2010 సంవత్సరాల్లో ఏర్పడిన కల్లోల స్థితి కంటే భయంకరమైనది. 2008లో గులాం నబీ ఆజాద్ సీఎంగా ఉండగా అమర్ నాథ్ ఆలయ బోర్డుకు 39 హెక్టార్ల అటవీ భూమిని బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై అల్లర్లు చెలరేగాయి. 2010లో మాఛిల్లో నలుగురు అమాయక యువకులను హతమార్చాక ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పుడు చెలరేగిన నిరస నలు స్వభావరీత్యా భిన్నమైనవి. గతంలో మిలిటెంట్ బృందాలు సైనిక వాహనా లపై దాడులకు పాల్పడేవి. ఇప్పుడు స్థానిక పోలీసులు, సైన్యమూ ఎంతగా నిలువ రించడానికి ప్రయత్నించినా జనం రోడ్లపైకి వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీనగర్‌లో చాలాచోట్ల పోలీస్స్టేషన్లను సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాల్సి వచ్చిందంటే ఎలాంటి స్థితి నెలకొన్నదో సులభంగా అంచనా వేసుకోవచ్చు. ఇదంతా బుర్హాన్ వానీ మరణం తర్వాత యాదృచ్ఛికంగా రాజుకున్న ఆగ్రహాగ్నిగా కనిపిస్తున్నా కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్‌ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలతో సహా వివిధ అంశాలపై గత కొన్నాళ్లుగా స్థానికుల్లో నెలకొన్న అసంతృప్తిని విస్మరించలేం. ఇంకా వెనక్కి వెళ్తే ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణించాక రెండు నెలలపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కూడా ఇందుకు దోహదపడింది. సీఎం పదవి చేపట్టేందుకు మెహబూబా ముఫ్తీ సుముఖంగా ఉన్నారో, లేదో... అసలు బీజేపీతో పీడీపీ చెలిమి కొనసాగుతుందో, లేదో ఎవరికీ తెలియలేదు. ఆమె తాత్సారం వెనకున్న కారణమేమిటో కూడా అంతుబట్టలేదు. ప్రభుత్వాన్ని ఏర్పర్చ డానికి అంగీకరించాక ముఫ్తీతో పోలిస్తే మరింత మెరుగైన ప్రతిపాదనలపై బీజేపీ నేతలను ఆమె ఒప్పించి ఉంటారని అందరూ అనుకున్నారు. అసలు ఈ కూటమిపై సొంత పార్టీలోనే ఆమె ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారని ఆ తర్వాత పార్టీలోని సీనియర్లు చేసిన ప్రకటనలు రుజువు చేశాయి. యువతకు ఉపాధి కల్పన, వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు అనువైన శిక్షణలాంటి హామీల సంగతిని ప్రభుత్వం విస్మరించిందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో బలంగా నెలకొంది. వాటి ఊసెత్తకపోగా తమ ప్రయోజనాలను మరింత దెబ్బతీసే ప్రతి పాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వారు శంకించే స్థితి ఏర్పడింది. జమ్మూలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలుకాగా తమ ప్రాంతాన్ని సరిగా పట్టించుకోవడం లేదని కశ్మీర్‌కు చెందిన కొందరు నాయకులు పలుమార్లు విమర్శించారు కూడా. ఏమాత్రం అప్రమత్తంగా ఉండే ప్రభుత్వమైనా వీటిని పరిగణనలోకి తీసుకునేది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని సులభంగానే ఊహించేది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించేది. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. అంతా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నట్టు వ్యవహరించింది. ముఫ్తీ పాలించిన తొలి 11 నెలలలో క్షేత్ర స్థాయిలో కొద్దో గొప్పో కనబడిన అభివృద్ధి కార్యక్రమాలు మెహబూబా వచ్చాక కుంటుబడ్డాయి. తీరా ఇప్పుడు తన ప్రభుత్వ వైఫల్యాలు వరసబెట్టి నిలదీస్తున్న తరుణంలో అసలు బీజేపీతో తాము కూటమి కట్టడమే సాధారణ ప్రజానీకానికి రుచించలేదని ఆమె మాట్లాడుతున్నారు. ఏమైతేనేం కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొల్పడం కోసం ప్రయత్నాలు మొద లైనట్టు కనబడుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన కోసం బుధవారం కశ్మీర్ వెళ్తున్నారు. 2010లో యూపీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై నియమించిన ముగ్గురు మధ్యవర్తుల్లో ఒకరైన ఎం ఎం అన్సారీతోపాటు మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, రక్షణ వ్యవహారాల నిపుణుడు కమార్ అఘా, సీనియర్ పాత్రికేయుడు జఫరుల్ ఇస్లాంఖాన్ వంటి పౌర సమాజ కార్యకర్తలతో ఇప్పటికే ఆయన రెండుసార్లు భేటీ అయ్యారు. వారు త్వరలో కశ్మీర్లో పర్యటించి స్థానికుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. సంక్షోభ సమయాలు ఏర్పడినప్పుడు చర్చలు సాగించడంవల్లనే సత్ఫలితాలు సాధ్యమ వుతాయి. నిరుడు నాగాలాండ్ తిరుగుబాటుదార్లతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం ఈ సంగతినే రుజువు చేసింది. కశ్మీర్‌కు కూడా అదే వర్తిస్తుంది. అందునా అది పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాష్ట్రం గనుక మరిన్ని జాగ్రత్తలు అవసర మవుతాయి. సమస్యను కేవలం శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూసి అంతా భద్రతా బలగాలకు వదిలేస్తే పరిస్థితులు మరింత విషమిస్తాయని ఈ 46 రోజుల పరిణామాలూ రుజువు చేశాయి. సాధ్యమైనంత త్వరలో చర్చల ప్రక్రియ ప్రారం భమై కశ్మీర్లో సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని దేశ ప్రజలంతా ఆశిస్తున్నారు. -
కశ్మీర్ అల్లర్లకు పాక్ నిధులు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో అల్లర్లను ప్రేరేపించడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కశ్మీర్లో అశాంతిని సృష్టించేందుకు ఆ దేశం రూ.24 కోట్లను ఖర్చు చేసిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వేర్పాటు వాదులకు జమాతే ఇస్లామీ, దుఖ్ త్రనన్ ఈ మిల్లత్ సంస్థల ద్వారా నిధులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆందోళనను ఉదృతం చేసేందుకే పొరుగు దేశం నిధులను పంపిణీ చేసిందని వెల్లడించారు. -
'కంప్యూటర్ పట్టాల్సిన చేత్తో రాళ్లేస్తున్నారు'
న్యూఢిల్లీ: చేతుల్లోకి కంప్యూటర్లు, క్రికెట్ బ్యాట్లు తీసుకోవాల్సిన కశ్మీర్ యువకులు రాళ్లు పట్టుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరం అని ఆయన అన్నారు. కశ్మీర్లో దేశంలోని ప్రతి పౌరుడు ఎంతో ప్రేమిస్తాడని.. కశ్మీరీలు భారతీయులు వేర్వేరు కాదని, భారత దేశ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని అన్నారు. కశ్మీర్‌లోని ప్రతి యువకుడిలో మంచి భవిష్యత్ చూడాలని అనుకుంటున్నామని అన్నారు. మంచి జీవనంకోసం కశ్మీర్ పౌరులు ఏం కోరకుంటే అది అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు ఒక్క అభివృద్ధి ద్వారా సాధ్యమని అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారానికి మాట్లాడుకోవడం, తీర్మానాలు పెట్టుకోవడంలాంటివి సహకరిస్తాయని చెప్ఓపారు.మానవత్వం, ప్రజాస్వామ్యం,కశ్మీరీయత్ అనే తమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నమ్మిన సిద్ధాంతాన్ని తాము విశ్వాసిస్తామని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్ పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సమావేశంలో మోదీ ఈ ప్రసంగం చేశారు. -
కొనసాగుతున్న కశ్మీర్ అశాంతిపై ఉత్కంఠ!
శ్రీనగర్: కశ్మీర్ లోయలో గత 30 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఇప్పటికీ సద్దుమణుగకపోవడంతో.. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి.. లోయలో సాధారణ పరిస్థితుల్ని ఎలా పునరుద్ధరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఉగ్ర సంస్థ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి కశ్మీర్లో ఆందోళనలు, అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సోమవారం ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. కశ్మీర్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏం చేయాలనే దానిపై వీరు చర్చించారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై రాజ్యసభలో స్పందించింది. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా రాజకీయ ప్రక్రియను చేపట్టాలని, దీనిని శాంతిభద్రతల అంశంగా పరిగణించరాదని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. కశ్మీర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కోరారు. ఈ విషయమై అఖిలపక్ష భేటీని నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కశ్మీర్ తాజా అలర్ల విషయంలో ముఖ్యమంత్రి మెహబూబా తీరుపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కశ్మీర్ అల్లర్లలో 50కిపైగా మంది చనిపోయి.. 31 రోజులపాటు ఘర్షణలు కొనసాగిన తర్వాత మెహబూబా ఎట్టకేలకు రంగంలోకి దిగారని, ఇన్నాళ్లు కొనసాగించిన తన యథాతథ స్థితి ధోరణని మార్చుకొని, ఇప్పటికైనా ఆమె ఢిల్లీకి వెళ్లి చర్యలకు ఉప్రకమించారని ఒమర్ పేర్కొన్నారు. -
సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేసి...
న్యూఢిల్లీ: కశ్మీర్ లో అల్లర్లు సృష్టిస్తున్నవారిపై పోలీసు పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ కు చెందిన ఓ సంస్థ ఆన్ లైన్ లో ప్రచారం చేపట్టింది. భారతీయ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిపై పెల్లెట్ గన్ ల ఉపయోగాన్ని వారు నిరసిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ నేతలు, బాలీవుడ్ నటీనటులు, క్రీడాకారులు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, అలియా భట్, ఐశ్వర్యారాయ్, సోనియా గాంధీ, జుకర్ బర్గ్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్ తదితర ప్రముఖుల ఫోటోలతో పెల్లెట్ గన్ ల వినియోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పోస్టులలో రాశారు. ఫోటోలలో పెల్లెట్ గన్ ల కారణంగా సెలబ్రిటీల ముఖానికి, కళ్లకు గాయాలైనట్లు మార్ఫింగ్ చేశారు. కశ్మీర్ కల్లోలంపై పాకిస్తాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఈ ఫోటోలు ఆన్ లైన్ లో విడుదలవ్వడం గమనార్హం. కాగా, పాక్ వ్యాఖ్యాలపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ ప్రజలల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా పాక్ వ్యాఖ్యలను చేయకూడదని సూచించారు. కశ్మీర్ లో రెండ్రోజుల పర్యటన ముగించుకున్న రాజ్ నాథ్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. పోలీసు బలగాలపై కశ్మీర్ యువత రాళ్లు విసరొద్దని, యువకులపై తొందరపడి పెల్లెట్ గన్ లు ఉపయోగించొద్దని భధ్రతా దళాలను ఆయన కోరారు. ఈనెల 8న టెర్రరిస్టు బుర్హాన్ వానీ కాల్చివేత అనంతరం రాజుకున్న కశ్మీర్ కల్లోలంలో ఇప్పటివరకు 45మంది మరణించారు. -
కశ్మీర్ లోయలో కొనసాగుతున్న కర్ఫ్యూ
-
'నేను చేసిన తప్పే ఆమె చేశారు'
శ్రీనగర్: కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2010లో తాను చేసిన తప్పునే ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మళ్లీ చేశారని అభిప్రాయపడ్డారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ హతం తర్వాత తలెత్తె పరిస్థితులను అంచనా వేయడంలో ఆమె విఫలమయ్యారని విమర్శించారు. "నేను చేసినట్టుగానే ముఫ్తి తప్పు చేశారు. బూటకపు ఎన్కౌంటర్లో మఖీల్ హతమైన తర్వాత 2010లో చోటుచేసుకున్న అల్లర్లను అదుపులో చేయడంలో నేను విఫలమయ్యాను. అల్లర్లు మొదలైన తర్వాత మొదటి 24-48 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో చురుగ్గా వ్యవహరించకుంటే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ముఫ్తి విఫలమయ్యారు. 2010లో జరిగిన అల్లర్లలో 116 మంది మృతి చెందారు. అప్పుడు సీఎంగా ఉన్న నన్ను రాజీనామా చేయాలని ముఫ్తి డిమాండ్ చేశారు. కానీ నేను రాజీనామా చేయలేదు. 2014లో మేము ఓడిపోవడానికి ఈ ఘటన కూడా ఒక కారణం. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొవడం ముఫ్తికి కొంచెం కష్టమే'నని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.