ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని నేరుగా లండన్ వెళ్లిన నవాజ్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండు నెలలుగా కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్తతలకు కొనసాగింపుగానే ఉరీ ఉగ్రదాడి జరిగిఉండొచ్చని అన్నారు. 'భారత సైన్యం అణిచివేతతో ఎంతో మంది కశ్మీరీలు తమ ఆప్తులను కోల్పోయారు. లెక్కకుమించి యువకులు కళ్లు పోగొట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగానే ఉరీలో దాడి జరిగింది. ఎప్పటిలాగే భారత్.. పాకిస్థాన్ వైపే వేలెత్తిచూపుతోంది. సరైన ఆధారాలు లేకుండా పాకిస్థాన్ ను నిందించడం ఆ (భారత్)దేశానికున్న చారిత్రక అలవాటు. ఉరీలో చనిపోయిన నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ లో తయారైన గ్రెనేడ్లు, ఆహారం వినియోగించారని ఆరోపిస్తున్నారు. కానీ రెండు నెలల కిందట బుర్హాన్ వని చనిపోయినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఎలాంటి సంబంధాలు ఎనసాగటంలేదని గుర్తుంచుకోవాలి' అని షరీఫ్ వ్యాఖ్యానించారు.