
చర్చల దిశగా ‘కశ్మీర్’
గత 46 రోజులుగా అల్లకల్లోలంగా ఉన్న కశ్మీర్ విషయంలో మంగళవారం జరిగిన పరిణామాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఆ సమస్యపై రాజ్యాంగానికి లోబడి చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా, రాజకీయ పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. గత నెల 8న హిజ్బుల్ సంస్థ కమాండర్ బర్హాన్ వానీని భద్రతా బలగాలు మట్టుపెట్టింది మొదలుకొని ఈరోజు వరకూ కశ్మీర్ మండుతూనే ఉంది. కర్ఫ్యూ, బాష్పవాయు గోళాల ప్రయోగం, కాల్పులు నిత్యకృత్యమయ్యాయి. వివిధ ఘటనల్లో మరణిం చినవారి సంఖ్య 69కి చేరుకుంది. వందలమంది గాయపడ్డారు. పెల్లెట్లు ప్రయోగిం చిన కారణంగా అనేకులు కంటిచూపు కోల్పోయారు.
ఇంత జరిగాక తొలిసారిగా మంగళవారం పగటిపూట కర్ఫ్యూను సడలించారు. వాస్తవానికి ఈ నెల 13న న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగినప్పుడు చర్చల విషయమై ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని అందరూ ఆశించారు. ఆ భేటీలో పాల్గొన్న రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వానికి అదేవిధంగా విజ్ఞప్తి చేశాయి. కానీ వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దేశంలో విలీనం చేయడం ఇప్పుడు మిగిలిన ఎజెండా అన్నారు. అక్కడా, బలూచిస్తాన్‌లోనూ పాక్ సైన్యం సాగిస్తున్న హింసాకాండను ప్రస్తావించారు.
కశ్మీర్‌లో.. మరీ ముఖ్యంగా దక్షిణ కశ్మీర్ జిల్లాల్లో ఇప్పుడు నెలకొన్న స్థితి అసాధారణమైనది. ఇంతక్రితం 2008, 2010 సంవత్సరాల్లో ఏర్పడిన కల్లోల స్థితి కంటే భయంకరమైనది. 2008లో గులాం నబీ ఆజాద్ సీఎంగా ఉండగా అమర్ నాథ్ ఆలయ బోర్డుకు 39 హెక్టార్ల అటవీ భూమిని బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై అల్లర్లు చెలరేగాయి. 2010లో మాఛిల్‌లో నలుగురు అమాయక యువకులను హతమార్చాక ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పుడు చెలరేగిన నిరస నలు స్వభావరీత్యా భిన్నమైనవి.
గతంలో మిలిటెంట్ బృందాలు సైనిక వాహనా లపై దాడులకు పాల్పడేవి. ఇప్పుడు స్థానిక పోలీసులు, సైన్యమూ ఎంతగా నిలువ రించడానికి ప్రయత్నించినా జనం రోడ్లపైకి వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీనగర్‌లో చాలాచోట్ల పోలీస్‌స్టేషన్లను సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాల్సి వచ్చిందంటే ఎలాంటి స్థితి నెలకొన్నదో సులభంగా అంచనా వేసుకోవచ్చు. ఇదంతా బుర్హాన్ వానీ మరణం తర్వాత యాదృచ్ఛికంగా రాజుకున్న ఆగ్రహాగ్నిగా కనిపిస్తున్నా కశ్మీరీ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్‌ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలతో సహా వివిధ అంశాలపై గత కొన్నాళ్లుగా స్థానికుల్లో నెలకొన్న అసంతృప్తిని విస్మరించలేం.
ఇంకా వెనక్కి వెళ్తే ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణించాక రెండు నెలలపాటు రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కూడా ఇందుకు దోహదపడింది. సీఎం పదవి చేపట్టేందుకు మెహబూబా ముఫ్తీ సుముఖంగా ఉన్నారో, లేదో... అసలు బీజేపీతో పీడీపీ చెలిమి కొనసాగుతుందో, లేదో ఎవరికీ తెలియలేదు. ఆమె తాత్సారం వెనకున్న కారణమేమిటో కూడా అంతుబట్టలేదు. ప్రభుత్వాన్ని ఏర్పర్చ డానికి అంగీకరించాక ముఫ్తీతో పోలిస్తే మరింత మెరుగైన ప్రతిపాదనలపై బీజేపీ నేతలను ఆమె ఒప్పించి ఉంటారని అందరూ అనుకున్నారు. అసలు ఈ కూటమిపై సొంత పార్టీలోనే ఆమె ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారని ఆ తర్వాత పార్టీలోని సీనియర్లు చేసిన ప్రకటనలు రుజువు చేశాయి. యువతకు ఉపాధి కల్పన, వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు అనువైన శిక్షణలాంటి హామీల సంగతిని ప్రభుత్వం విస్మరించిందన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో బలంగా నెలకొంది. వాటి ఊసెత్తకపోగా తమ ప్రయోజనాలను మరింత దెబ్బతీసే ప్రతి పాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వారు శంకించే స్థితి ఏర్పడింది.
జమ్మూలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలుకాగా తమ ప్రాంతాన్ని సరిగా పట్టించుకోవడం లేదని కశ్మీర్‌కు చెందిన కొందరు నాయకులు పలుమార్లు విమర్శించారు కూడా. ఏమాత్రం అప్రమత్తంగా ఉండే ప్రభుత్వమైనా వీటిని పరిగణనలోకి తీసుకునేది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని సులభంగానే ఊహించేది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించేది. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. అంతా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నట్టు వ్యవహరించింది. ముఫ్తీ పాలించిన తొలి 11 నెలలలో క్షేత్ర స్థాయిలో కొద్దో గొప్పో కనబడిన అభివృద్ధి కార్యక్రమాలు మెహబూబా వచ్చాక కుంటుబడ్డాయి. తీరా ఇప్పుడు తన ప్రభుత్వ వైఫల్యాలు వరసబెట్టి నిలదీస్తున్న తరుణంలో అసలు బీజేపీతో తాము కూటమి కట్టడమే సాధారణ ప్రజానీకానికి రుచించలేదని ఆమె మాట్లాడుతున్నారు.
ఏమైతేనేం కశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొల్పడం కోసం ప్రయత్నాలు మొద లైనట్టు కనబడుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన కోసం బుధవారం కశ్మీర్ వెళ్తున్నారు. 2010లో యూపీఏ ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై నియమించిన ముగ్గురు మధ్యవర్తుల్లో ఒకరైన ఎం ఎం అన్సారీతోపాటు మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, రక్షణ వ్యవహారాల నిపుణుడు కమార్ అఘా, సీనియర్ పాత్రికేయుడు జఫరుల్ ఇస్లాంఖాన్ వంటి పౌర సమాజ కార్యకర్తలతో ఇప్పటికే ఆయన రెండుసార్లు భేటీ అయ్యారు. వారు త్వరలో కశ్మీర్‌లో పర్యటించి స్థానికుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. సంక్షోభ సమయాలు ఏర్పడినప్పుడు చర్చలు సాగించడంవల్లనే సత్ఫలితాలు సాధ్యమ వుతాయి. నిరుడు నాగాలాండ్ తిరుగుబాటుదార్లతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం ఈ సంగతినే రుజువు చేసింది. కశ్మీర్‌కు కూడా అదే వర్తిస్తుంది. అందునా అది పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాష్ట్రం గనుక మరిన్ని జాగ్రత్తలు అవసర మవుతాయి.
సమస్యను కేవలం శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూసి అంతా భద్రతా బలగాలకు వదిలేస్తే పరిస్థితులు మరింత విషమిస్తాయని ఈ 46 రోజుల పరిణామాలూ రుజువు చేశాయి. సాధ్యమైనంత త్వరలో చర్చల ప్రక్రియ ప్రారం భమై కశ్మీర్‌లో సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని దేశ ప్రజలంతా ఆశిస్తున్నారు.