జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సదస్సు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ దారిలోనే సాగుతూ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ కూడా సార్క్ సదస్సును బహిష్కరించాయి. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయ్యే పరిస్థితి నెలకొంది.
18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ దాడి నేపథ్యంలో పాక్‌ను ఎంతమాత్రం ఉపేంక్షించరాదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు వీలున్న అన్నీ మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధు నది ఒప్పందంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పాక్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. తాజాగా సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ప్రాంతీయంగా ఆధిపత్యం సాధించింది. ఈ నిర్ణయం ద్వారా భారత్ దక్కిన సానుకూలతలు ఏమిటంటే..
ప్రాంతీయ సహకారంలోనూ ఉగ్రవాద కోణాన్ని జోడించడం!
'ప్రాంతీయ సహకారం, అనుసంధానత, సంప్రదింపుల విషయంలో భారత్ కట్టుబడి ఉంది. కానీ, ఇది ఉగ్రవాద రహిత వాతావరణంలోనే ముందుకు సాగుతుందని భావిస్తోంది'.. పాక్‌లో 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ద్వారా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాదు.. దక్షిణాసియా ప్రాంతీయ సహకారానికి పెను ముప్పుగా మారిందనే విషయాన్ని మన దేశం తేల్చిచెప్పింది. ఒకప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల సందర్భంలోనే ఉగ్రవాద రహిత వాతావరణం ప్రస్తావన వచ్చేది. కానీ ఇప్పుడు ప్రాంతీయ చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన అంశంగా భారత్ ముందుకు తెచ్చింది.
పాక్‌ను ఇరుకునపెట్టడంలో భారత్‌కు కొత్త మిత్రులు!
పాక్‌ను ప్రాంతీయంగా ఇరుకున పెట్టడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించింది. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారా? లేదా? అన్నది సందేహాస్పదంగా ఉండగానే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ముందుకొచ్చి.. తాము ఆ దేశానికి వెళ్లబోమని తేల్చిచెప్పాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా చెప్పడంతో బంగ్లా, ఆఫ్గన్‌తో మన పొరుగు దేశం భూటాన్ కూడా జతకలిసి.. పాక్‌కు షాకిచ్చింది.
సార్క్ పునరుద్ధరణ!
1985లో దక్షిణాసియాలోని ఎనిమిది సభ్యదేశాలతో ఏర్పాటైన సార్క్‌తో విస్తృత సంబంధాలు కొనసాగించేందుకు ఎన్డీయే సర్కారు తపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం అడ్డుపుల్ల వేస్తోంది. సార్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కొర్రిలు పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మినహాయించి ఇతర సార్క్ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, పాక్‌ను బ్లాక్ చేసేలా సబ్-రిజినల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.
రాజకీయంగా కీలకమే!
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ పాకిస్థాన్‌ను నియంత్రించడం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలపై నిలబడాల్సిన పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వానిది. అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పాక్‌పై కఠినంగా వ్యవహరించక తప్పదు. ఆ సంకేతాలు ఇచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఇక పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న విధానం కూడా అమలవుతున్నదన్న సంకేతాలను సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా భారత్ ఇచ్చినట్టు అయింది. దీనికితోడు బంగ్లా, ఆఫ్గన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నివారించి ఆ దేశాలను తనవైపు తిప్పుకోవడంలోనూ అడ్వాంటేజ్ సాధించింది. నిజానికి దక్షిణాసియాలో మిత్రదేశాలు కావాలని పాక్ కోరుకోవడం లేదు. చైనా, అమెరికా, సౌదీ అరేబియలతో దౌత్య సంబంధాలకే ఆ దేశం అధిక ప్రాధాన్యమిస్తోంది. అయినా సార్క్ సదస్సును నిర్వహించే అవకాశాన్ని పాక్ కోల్పోవడం నిజంగా ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
Published Wed, Sep 28 2016 4:57 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement