పాకిస్థాన్ సైన్యానికి ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్!
ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించినట్టు కనిపిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావాల్సి వస్తుందంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైన్యాన్ని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై విచారణ త్వరగా పూర్తిచేయాలని, స్తంభించిపోయిన ముంబై దాడుల కేసు విచారణను తిరగదొడాలని ఆయన సైన్యానికి తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్ ప్రధాన పత్రిక 'డాన్' వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అసాధారణరీతిలో ప్రభుత్వం సైన్యానికి పరుషమైన హెచ్చరికలు జారీచేసిందని ఈ భేటీలో పాల్గొన్న విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక గురువారం వెల్లడించింది.
నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై చర్యలు సహా కీలకాంశాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా సైన్యం నడుచుకోవాలని షరీఫ్ ఈ భేటీలో స్పష్టం చేసినట్టు డాన్ పత్రిక పేర్కొంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు పూర్తిచేసేందుకు, ముంబై దాడుల కేసులో పునర్విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని షరీఫ్ తేల్చిచెప్పినట్టు తెలిపింది. నిషేధిత లేదా అదుపులో లేని మిలిటెంట్ గ్రూపులపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకుంటే.. అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చిందని, ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేసేందుకు ఐఎస్‌ఐ చీఫ్ లెప్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, జాతీయ భద్రతా సలహాదారు నజర్ జంజువా నాలుగు ప్రావిన్సులలో పర్యటించనున్నారని ఆ పత్రిక వెల్లడించింది.
జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరుపడంతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సార్క్ దేశాలు కూడా పాక్ తీరును నిరసిస్తూ.. ఆ దేశంలో సార్క్ సదస్సుకు హాజరుకాబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇరకాటంలో పడ్డ పాక్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు.