HM Rajnath Singh
-
'పాకిస్థాన్ జిందాబాద్' గొంతుకలతో చర్చలా?
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఆందోళనలతో అట్టుడుకుతోన్న కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, పాకిస్థాన్ కు వత్తాసుపలుకుతూ, తాము పాకిస్థానీయులమేనని చెప్పుకుంటున్నవారిపై జమ్ముకశ్మీర్ ఇస్లాం మతబోధకులు మండిపడ్డారు. కశ్మీర్ మతబోధకుల బృందం మంగళవారం ఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి, పాకిస్థాన్ కు జిందాబాద్ కొడుతున్న వేర్పాటువాదులతో చర్చలు జరపొద్దని డిమాండ్ చేసింది. శని, ఆదివారాల్లో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్ష బృందంలోని కొందరు సభ్యులు వేర్పాటువాదులతో సమావేశం కావడాన్ని ముస్లిం మతపెద్దలు తప్పుపట్టారు. కశ్మీర్ సమస్య పరిష్కరించే క్రమంలో అలాంటి వారితో చర్చలు అనవరసమని వారు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని రాజ్ నాథ్ ముందు వెల్లడించారు. వేర్పాటువాదుల తీరు తనను కూడా అసంతృప్తికి గురిచేసిందని హోం మంత్రి అన్నారు. రాజ్ నాథ్ నేతృత్వంలో కశ్మీర్ లో పర్యటించిన అఖిలపక్షబృందంలో సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ, జేడీయూ, ఆర్జేడీలకు చెందిన ఎంపీలు డి. రాజా, శరద్ యాదవ్, జయప్రకాశ్ నారాయణ్ లు మరో ప్రత్యేక బృందంగా ఏర్పడి వేర్పాటువాద నేతలతో చర్చలు జరిపేందుకు ఆదివారం విఫలయత్నం చేశారు. గృహనిర్భంధంలో ఉన్న హురియత్ కీలక నేత సయీద్ అలీషా గిలానీ.. తాను ఎంపీల బృందంతో మాట్లాడబోనని తేగేసి చెప్పారు. మరో నేత అబ్దుల్ ఘనీ భట్ అఖిలపక్షం పర్యటనను పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ కూడా ఇదే తరహాలో స్పందించారు. ప్రస్తుతం పోలీస్ నిర్బంధంలో ఉన్న యాసిన్.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మాట్లాడలేనని, ఢిల్లీకి వచ్చినప్పుడు కలుస్తానని ఎంపీలతో అన్నారు. దీనిపై రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ 'కశ్మీరియత్, ఇన్సానియత్, జమూరియత్' విధానానికి వ్యతిరేకంగా వేర్పాటువాద నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేరీతిలో ఇప్పుడు కశ్మీరీ మతపెద్దలు కూడా వేర్పాటువాద నేతలతో ఎంపీలు మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు కశ్మీర్ ఆందోళనలను అదుపుచేసే క్రమంలో వేర్పాటువాద నేతలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయా నేతలకు కల్పిస్తోన్న భద్రతను ఉపసంహరణ లేదా తగ్గించాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేర్పాటువాద నేతల విదేశీయానాలు, ఇతర పర్యటనలు, సమావేశాలనూ నియంత్రించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కాగా, కశ్మీర్ లో పర్యటించిన అఖిలిపక్ష బృందం బుధవారం ఢిల్లీలో మరోసారి భేటీ కానున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ చెప్పారు. -
మా ముస్లింల గురించి పాక్కు అనవసరం
-
'మా ముస్లింల గురించి పాక్కు అనవసరం'
న్యూఢిల్లీ: కశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గురువారం లోక్ సభలో కశ్మీర్ అల్లర్లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ వివరణ ఇస్తూ భారత్కు కశ్మీర్ కిరీటం వంటిదని అన్నారు. కశ్మీర్ అల్లర్లపై చర్చ జరగడం అనేది చాలా అవసరం, ముఖ్యమైనది కూడా అని చెప్పారు. లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల ప్రమేయం ఈ అల్లర్ల వెనుక ఉందని చెప్పారు. ఈ అల్లర్లకు ప్రధాన కారణమైన బృహాన్ మనీ హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ కమాండర్ గా పనిచేశాడని అన్నారు. సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ యువకులను రెచ్చగొట్టారని అన్నారు. భారత్ లోని ముస్లింల గురించి పాకిస్థాన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కశ్మీర్ విషయంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా భారత మాజీ ప్రధాని వాజ్ పేయి వినిపించిన కవితను రాజ్ నాథ్ వినిపించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలం అని చెప్పారు. మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము శాయశక్తులు కృషి చేస్తున్నామని అన్నారు. కశ్మీర్ పరిస్థితిని చక్కదిద్దుతాం అని హామీ ఇచ్చారు. -
వాడి వేడితో స్తంభించిన పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటును గుజరాత్లోని ఉనాలో దళితులపై దాడి అంశం కుదిపేస్తోంది. రెండు సభలను అట్టుడుకిస్తోంది. గోమాంసం పంపిణీ చేస్తున్నారనే కారణంతో కొందరు దళిత యువకులను బహిరంగంగా రోడ్డుపై నిల్చొబెట్టి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీని వీడియోలు బయటకు రావడంతో భారీ ఎత్తున ఆందోళన గందరగోళం నెలకొంది. గుజరాత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తున్నారని అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని బీఎస్పీ అధినేత్రి మాయవతి రాజ్యసభలో పట్టుబట్టారు. అందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో రచ్చరచ్చ చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇలా మొత్తం నాలుగుసార్లు ఇప్పటికే రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో చేసిన ప్రకటన కూడా రాజ్యసభలో గందరగోళానికి తెరతీసింది. లోక్సభలో ఈ అంశంపై రాజ్నాథ్ సింగ్ ఏమని ప్రకటన చేశారంటే... 'గుజరాత్ లో దళితులపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. దళితులపై దాడులు అనేవి సాంఘిక నేరం. దీన్ని ప్రతిఒక్కరు సవాల్ గా తీసుకొని ముందుకెళ్లాలి. వాటిని లేకుండా చేయాలి. ఈ విషయంపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగి సమస్యను పరిష్కరిద్దాం. కాంగ్రెస్ పాలనలో గుజరాత్ లో దళితులపై భారీ సంఖ్యలో దాడులు జరిగాయి. వాటితో పోలిస్తే ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న సర్కార్ వెంటనే అలాంటి పరిస్థితి లేకుండా నిలువరించింది. మొత్తం తొమ్మిదిమందిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఏడుగురిని రిమాండ్ కు పంపించారు. నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు' అని అన్నారు. కాంగ్రెస్ పై ఆరోపణలు చేయగానే ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే లాంటివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా మరింత పెద్దదిగా హోంమంత్రి చేస్తున్నారని ఆరోపించారు.