న్యూఢిల్లీ: పార్లమెంటును గుజరాత్లోని ఉనాలో దళితులపై దాడి అంశం కుదిపేస్తోంది. రెండు సభలను అట్టుడుకిస్తోంది. గోమాంసం పంపిణీ చేస్తున్నారనే కారణంతో కొందరు దళిత యువకులను బహిరంగంగా రోడ్డుపై నిల్చొబెట్టి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీని వీడియోలు బయటకు రావడంతో భారీ ఎత్తున ఆందోళన గందరగోళం నెలకొంది. గుజరాత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు చేస్తున్నారని అటు లోక్ సభలో ఇటు రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని బీఎస్పీ అధినేత్రి మాయవతి రాజ్యసభలో పట్టుబట్టారు. అందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో రచ్చరచ్చ చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇలా మొత్తం నాలుగుసార్లు ఇప్పటికే రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో చేసిన ప్రకటన కూడా రాజ్యసభలో గందరగోళానికి తెరతీసింది. లోక్సభలో ఈ అంశంపై రాజ్నాథ్ సింగ్ ఏమని ప్రకటన చేశారంటే... 'గుజరాత్ లో దళితులపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. దళితులపై దాడులు అనేవి సాంఘిక నేరం.
దీన్ని ప్రతిఒక్కరు సవాల్ గా తీసుకొని ముందుకెళ్లాలి. వాటిని లేకుండా చేయాలి. ఈ విషయంపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగి సమస్యను పరిష్కరిద్దాం. కాంగ్రెస్ పాలనలో గుజరాత్ లో దళితులపై భారీ సంఖ్యలో దాడులు జరిగాయి. వాటితో పోలిస్తే ప్రస్తుతం గుజరాత్ లో ఉన్న సర్కార్ వెంటనే అలాంటి పరిస్థితి లేకుండా నిలువరించింది.
మొత్తం తొమ్మిదిమందిని ఈ కేసులో అరెస్టు చేశారు. ఏడుగురిని రిమాండ్ కు పంపించారు. నిర్లక్ష్యం వహించిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు' అని అన్నారు. కాంగ్రెస్ పై ఆరోపణలు చేయగానే ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే లాంటివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా మరింత పెద్దదిగా హోంమంత్రి చేస్తున్నారని ఆరోపించారు.
వాడి వేడితో స్తంభించిన పార్లమెంటు
Published Wed, Jul 20 2016 1:10 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM
Advertisement
Advertisement