
'రాళ్లు విసరొద్దు.. గన్స్ పేలొద్దు'
శ్రీనగర్: దయచేసి యువకులు ఎవరూ బలగాలపై రాళ్ల దాడి చేసే ప్రయత్నం చేయొద్దని కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అదే సమయంలో పోలీసు బలగాలు అల్లర్లు నియంత్రించే సమయంలో పెల్లెట్ గన్లు ఉపయోగించరాదని చెప్పారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన ఆయన కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం పాకిస్థాన్ అని, ఈ విషయంలో తాము ఒక గట్టి నిర్ణయానికి వచ్చామని చెప్పారు.
కశ్మీర్ లో ఎప్పటి మాదిరిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 'కశ్మీర్ లో పరిస్థితిపట్ల మూడో వర్గానికి(పాకిస్థాన్) ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా సమస్య ఉంటే మనమంతా కూర్చుని చర్చించుకుందాం' అని రాజ్ నాథ్ అన్నారు. పాకిస్థాన్ ప్రలోభాలకు కశ్మీర్ యువతి గురికావొద్దని, అనవసరం ఉగ్రవాద భావజాలం మాయలో పడొద్దని హెచ్చరించారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రి మహబూబా మఫ్తీతో మాట్లాడానని, ఆమె గాయపడి వైద్య ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వం తరుపున ఉచిత చికిత్స అందించే ఏర్పాట్లుకూడా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్ లో వైద్యం చేయిస్తామని ఆయన అన్నారు.